మాల్దీవుల అధ్యక్షుడికి షాక్..

అధికారం చేపట్టిన కొన్ని నెలల్లోనే మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జుకు ఎదురుదెబ్బ తగిలింది. రాజధాని మాలె మేయర్ ఎన్నికల్లో ఆయన పార్టీ పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ ఘోర ఓటమి చవిచూసింది. భారత అనుకూల పార్టీ అయిన మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ (MDP) ఘనవిజయం సాధించింది. భారత్తో దౌత్యపరమైన విభేదాలు కొనసాగుతున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
మాలె మేయర్గా ఎండీపీకి చెందిన ఆదమ్ అజీమ్ ఎన్నికయ్యారు. అధ్యక్ష అభ్యర్థిగా బరిలో దిగేంత వరకు ఆ పదవిలో ముయిజ్జు కొనసాగారు. అజీమ్ గెలుపును మాల్దీవుల మీడియా ‘అఖండ విజయం’గా అభివర్ణించింది. ఎండీపీకి ప్రస్తుతం భారత అనుకూల విధానాలను అనుసరించే మాజీ అధ్యక్షుడు మహమ్మద్ సొలిహ్ నాయకత్వం వహిస్తున్నారు. చైనా అనుకూల వైఖరి ప్రదర్శిస్తున్న ముయిజ్జు చేతిలో అధ్యక్ష ఎన్నికల్లో ఆయన ఓటమిపాలయ్యారు. మేయర్ గెలుపు ఎండీపీకి రాజకీయంగా కలిసొస్తుందని అక్కడి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇటీవలికాలంలో ముయిజ్జు తీసుకుంటున్న భారత వ్యతిరేక నిర్ణయాలు… అక్కడి ప్రజలకు సైతం నచ్చినట్లు కనిపించడం లేదు. చిరకాల మిత్రపక్షం , ఆపదలో ఆదుకుంటున్న భారత ప్రధాని మోడీపై.. అనుచిత వ్యాఖ్యలు ఆదేశ ఆర్థికవ్యవస్థపై పెను ప్రభావం చూపిస్తున్నాయి. పర్యాటకరంగం, చేపలు తప్ప ఇంకేరకమైన ఆధారం లేని మాల్దీవులు.. మోడీపై వ్యాఖ్యలతో ఇబ్బందుల్లో పడింది. చాలా మంది భారతీయులు నెట్ లో బాయ్ కాట్ మాల్దీవులును విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఇది ఆదేశ పర్యాటక రంగాన్ని దారుణంగా దెబ్బతీస్తుందన్న అంచనాలున్నాయి. ఒకవేళ పర్యాటకరంగం పతనమైతే, మాల్దీవుల పరిస్థితి మారింత దారుణంగా మారనుందని విశ్లేషకులు చెబుతున్నారు.
దీనికితోడు చైనా ఎలా వ్యవహరిస్తుందో, మాల్దీవుల ప్రజలకు తెలియంది కాదు. ఈ పరిస్థితుల్లో ప్రెసిడెంట్ ముయిజ్జు .. చైనాతో రాసుకుపూసుకు తిరగడం, ఆదేశప్రజలకు ఆగ్రహం కలిగిస్తోంది. దీనికి ఓ ప్రత్యక్ష నిదర్శనమే మాలె మేయర్ ఎన్నికంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇదే పరిస్థితి కొనసాగితే ముయిజ్జు పార్టీకి కష్టకాలం తప్పదని అంచనాలున్నాయి. కేవలం కొన్ని నెలల వ్యవధిలోనే ప్రభుత్వంపై వ్యతిరేకత కనిపిస్తోందంటున్నారు నిపుణులు.











































































