చైనాతో మాల్దీవులు చెట్టపట్టాల్…

భారత ప్రధానమంత్రి మోడీపై అనుచిత వ్యాఖ్యల ప్రభావం.. మాల్దీవులపై గట్టిగా పడింది. భారత ప్రధానమంత్రిపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా అని మండిపడిన భారతీయులు… మాల్దీవుల్లో వెకేషన్ ట్రిప్స్ రద్దు చేసుకుంటున్నారు. దీంతో వేలాదిగా హోటల్స్ బుకింగ్స్ రద్దయ్యాయి. ఈజ్ మై ట్రిప్ ట్రావెల్స్ సంస్థ … మాల్దీవులకు ఫ్లైట్ బుకింగ్ ఆపేసింది. దీంతో మాల్దీవులు పర్యాటకరంగం తీవ్రంగా దెబ్బతింటోంది.
అయితే… తమ నేతలు చేసిన విచారకరమైన వ్యాఖ్యలను పట్టించుకోవద్దని మాల్దీవుల టూర్ అండ్ ట్రావెల్ ఆపరేటర్ల సంఘం ఈజ్ మై ట్రిప్‌ను కోరింది. ఆ మాటలు మాల్దీవుల ప్రజల అభిప్రాయం కాదని వెల్లడించింది. ఈజ్ మై ట్రిప్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని, తమ దేశానికి విమాన బుకింగ్‌లను తెరవాలని లేఖ రాసింది. లక్షద్వీప్‌పై మాల్దీవుల మంత్రులు చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో దేశీయ ప్రయాణ సంస్థ ఈజ్ మై ట్రిప్.. మాల్దీవులకు విమానాల బుకింగ్‌లను నిలిపివేసిన సంగతి తెలిసిందే.
ఓవైపు భారత్ తో స్వల్ప ఉద్రిక్తతల నడుమ.. మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు చైనా పర్యటన ఆసక్తికరంగా మారింది..ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య గల ద్వైపాక్షిక సంబంధాలను సమగ్ర వ్యూహాత్మక సహకార భాగస్వామ్యంగా విస్తృతం చేసుకోవడానికి నేతలిద్దరూ అంగీకరించారు. ఈ మేరకు దేశ అధికార వార్తా సంస్థ జిన్హువా వెల్లడించింది. ‘‘మాల్దీవులు, చైనా మధ్య 20 ఒప్పందాలు కుదిరాయి. ఈ ఒడంబడికల కార్యక్రమానికి ఇరు దేశాల అధ్యక్షులు హాజరయ్యారు’’ అని మాల్దీవుల అధ్యక్ష కార్యాలయం ‘ఎక్స్’లో తెలిపింది. అంతకు ముందు ముయిజ్జు, ఆయన భార్య సాజిదా మహ్మద్‌కు గ్రేట్ హాల్ ఆఫ్ పీపుల్ వద్ద జిన్‌పింగ్, ఆయన భార్య పెంగ్ లియువాన్ సంప్రదాయ స్వాగతం పలికారు. ముయిజ్జుకు రెడ్‌కార్పెట్ స్వాగతంతో పాటు 21 తుపాకులు గౌరవ వందనం లభించింది. అనంతరం ముయిజ్జు దంపతుల గౌరవార్థం జిన్‌పింగ్ దంపతులు అధికారిక విందు ఇచ్చారు. తమ పర్యాటక రంగాభివృద్ధికి సహకరించాలని మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు.. చైనాను కోరారు. పర్యాటక రంగంపై ఆధారపడిన దేశం కావడంతో..టూరిజం పెంపుదలకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
భారత్‌పై వ్యతిరేకతను పెంచిన అధికార కూటమి
2023లో జరిగిన అధ్యక్ష ఎన్నికల సందర్భంగా అధికార ప్రోగ్రెస్సివ్ పార్టీ ఆఫ్ మాల్దీవ్స్ (పీపీఎం), పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ (పీఎన్సీ) పెద్ద ఎత్తున భారత వ్యతిరేక భావాలను ప్రచారంలోకి తెచ్చాయని ఓ నివేదిక వెల్లడించింది. అలాగే భారత్‌కు సంబంధించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తిలోకి తీసుకొచ్చాయంది. గతేడాది సెప్టెంబరు 9-30 తేదీల్లో మాల్దీవుల్లో జరిగిన అధ్యక్ష ఎన్నికలపై యూరోపియన్ ఎలక్షన్ అబ్జర్వేషన్ మిషన్ తుది నివేదికను విడుదల చేసింది. తమ దేశంపై భారత్ ప్రభావాన్ని బూచిగా చూపడాన్నే ప్రధాన ఎన్నికల ప్రచారాస్త్రంగా పీపీఎం-పీఎన్సీ కూటమి వాడుకుందని తేల్చింది. మాల్దీవుల ఉన్నతస్థాయి జాతీయ అధికారుల ఆహ్వానంపై ఈయూ ఈవోఎం ఆ దేశంలో 11 వారాలపాటు అధ్యక్ష ఎన్నికల తీరును పరిశీలించి నివేదికను రూపొందించింది.











































































