INDIA Alliance: ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి

భారత రాజకీయ రంగంలో మరోసారి ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. సెప్టెంబర్ 9న జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికల (Vice president election) కోసం ప్రతిపక్ష ఇండియా కూటమి తమ అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డిని (Justice B Sudarshan Reddy) ఎంపిక చేసింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇండియా కూటమిలోని అన్ని పక్షాలు ఇందుకు ఏకగ్రీవంగా మద్దతు తెలిపాయని చెప్పారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా ఆకుల మైలారం గ్రామంలో జన్మించిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి అంచలంచెలుగా ఎదిగారు. ఇప్పుడు ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేయడం ద్వారా రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకు సిద్ధమవుతున్నారు.
జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి 1946 జులై 8న తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా, ఆకుల మైలారం గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. హైదరాబాద్‌లో విద్యాభ్యాసం చేసిన ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి 1971లో న్యాయ శాస్త్రంలో డిగ్రీ పొందారు. అదే సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్‌లో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. ప్రముఖ న్యాయవాది కె.ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో న్యాయవాద వృత్తిని ప్రారంభించిన ఆయన, హైదరాబాద్‌లోని సిటీ సివిల్ కోర్టులు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వివిధ రకాల కేసులను నిర్వహించారు. పౌర, రాజ్యాంగ, రెవెన్యూ, క్రిమినల్ కేసులలో ఆయన నైపుణ్యం అపారం.
1988 ఆగస్టు 8 నుంచి 1990 జనవరి 8 వరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రెవెన్యూ విభాగంలో గవర్నమెంట్ ప్లీడర్‌గా సేవలందించారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వానికి అదనపు స్టాండింగ్ కౌన్సెల్‌గా కొంతకాలం పనిచేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి లీగల్ అడ్వైజర్‌గా, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అడ్వొకేట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా 1993లో ఎన్నికైన ఆయన, 1995 మే 2న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2005 డిసెంబర్ 5న గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, 2007 జనవరి 12న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎదిగారు. 2011 జులై 8న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన ఆయన, గోవా రాష్ట్రానికి మొదటి లోకాయుక్తగా కూడా సేవలందించారు. రాజ్యాంగ, క్రిమినల్, టాక్సేషన్, సర్వీస్ లా, మానవ హక్కుల రంగాల్లో ఆయన ఇచ్చిన తీర్పులు గణనీయమైనవి.
ఇండియా కూటమి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయడం ఒక వ్యూహాత్మక నిర్ణయంగా చెప్పవచ్చు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. తృణమూల్ కాంగ్రెస్ (TMC), ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) సహా ఇతర కూటమి పక్షాలు ఈ ఎంపికకు పూర్తి మద్దతు ప్రకటించాయి. ఈ ఎన్నికను ఒక భావజాల యుద్ధంగా అభివర్ణించిన ఖర్గే, జస్టిస్ రెడ్డిని దేశంలోని అత్యంత ప్రగతిశీల న్యాయవాదుల్లో ఒకరిగా పేర్కొన్నారు.
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి మహారాష్ట్ర గవర్నర్ సీ.పీ.రాధాకృష్ణన్‌ను తమ అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో.. ఇండియా కూటమి అభ్యర్థి ఎవరనేదానిపై ఉత్కంఠ నెలకొంది. అయితే న్యాయరంగంలో విశేష అనుభవం కలిగిన సుదర్శన్ రెడ్డిని ఎంపిక చేసి తమ బలాన్ని చాటుకోవాలని భావించింది. న్యాయ రంగంలో అనుభవం, తెలంగాణ నేపథ్యం, సామాజిక న్యాయం పట్ల జస్టిస్ రెడ్డి చూపిన నిబద్ధత ఈ ఎంపికకు బలమైన కారణాలుగా చెప్పవచ్చు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన కుల గణన సర్వే వంటి సామాజిక న్యాయ కార్యక్రమాలకు జస్టిస్ రెడ్డి నాయకత్వం వహించడం కూడా ఈ నిర్ణయంలో కీలక పాత్ర పోషించిందని చెప్పవచ్చు.
జస్టిస్ సుదర్శన్ రెడ్డి తెలంగాణ ఆవిర్భావానికి ముందు, ఆ తర్వాత రాష్ట్ర రాజకీయ, న్యాయ రంగాల్లో కీలక పాత్ర పోషించారు. తెలంగాణలో ఇటీవల జరిగిన కుల గణన సర్వేలో ఆయన నేతృత్వంలోని స్వతంత్ర నిపుణుల బృందం (IEWG) పనితీరు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఈ సర్వే ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు, విద్యా సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్‌ను సిఫారసు చేసింది. ఈ సామాజిక న్యాయ కార్యక్రమంలో ఆయన పాత్ర, ఇప్పుడు ఇండియా కూటమి అభ్యర్థిగా ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేసేందుకు దారి చూపించింది.
అయితే ఈ ఎన్నికలో ఇండియా కూటమి ఎదుర్కొంటున్న సవాళ్లు తక్కువ కాదు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి పార్లమెంటులో పూర్తిస్థాయి బలం కలిగి ఉంది. కాబట్టి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గెలుపు అంత ఈజీ కాదు. అయినా ఇండియా కూటమి తమ వైఖరిని, భావజాలాన్ని, సామాజిక న్యాయం పట్ల నిబద్ధతను దేశవ్యాప్తంగా చాటాలని భావిస్తోంది. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఏకాభిప్రాయం కోసం ఖర్గేతో చర్చలు జరిపినప్పటికీ, ఇండియా కూటమి సొంత అభ్యర్థిని నిలబెట్టాలని నిర్ణయించింది. మొత్తంగా, జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి యొక్క ఉపరాష్ట్రపతి అభ్యర్థిత్వం ఇండియా కూటమి వ్యూహాత్మక, భావజాల రాజకీయ ఎత్తుగడగా కనిపిస్తోంది.