భారత్, మాల్దీవుల మధ్య ‘టూరిజం’ వార్..

కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాల్దీవుల్లో భారత వ్యతిరేక కార్యకలాపాలు ఊపందుకున్నాయి. మాలె నుంచి భారతీయ సైనికులను ఉపసంహరించాలని మహమ్మద్ ముయిజ్జు… మోడీకి విజ్ఞప్తి చేశారు. అయితే ముయిజ్జుకు.. మొదటి నుంచి చైనా పప్పెట్ అన్న పేరుంది. ఎందుకంటే ముయిజ్జు..చైనా అనుకూలవాదన్న సంగతి అందరికీ తెలిసిందే. దీనికి మోడీ సానుకూలంగా స్పందించారు. అయితే ఇది అంతటితో ఆగలేదు.
ఇటీవలే ప్రధాని నరేంద్ర మోడీ.. కేంద్ర పాలిత ప్రాంతం లక్షద్వీప్ లో పర్యటించారు. కొంతసేపు సముద్రం ఒడ్డున సేద తీరారు. సముద్రంలో స్నార్కెలింగ్ చేశారు. సాహసాలు చేయాలనుకునే వారు.. తమ లిస్ట్‌లో లక్షద్వీప్‌ను కూడా చేర్చుకోవాలని కోరుతూ.. అక్కడి ఫొటోలను షేర్ చేశారు. ఈ పర్యటనతో స్థానిక పర్యాటక రంగానికి మరింత ప్రోత్సాహం లభిస్తుందని పలువురు నెటిజన్లు అభిప్రాయపడ్డారు.
భారత ప్రధాని నరేంద్ర మోడీ లక్షద్వీప్ పర్యటనపై మాల్దీవుల మంత్రులు, ఎంపీలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పర్యాటకంలో మాతో పోటీ పడాలన్న ఆలోచన భ్రమే అన్నారు. ప్రధాని పర్యటన వీడియోను ట్యాగ్ చేస్తూ… మా దేశం అందించే సర్వీస్‌ను ఎలా అందించగలరు? పరిశుభ్రంగా ఎలా ఉంచగలరు? అక్కడి గదుల్లో వచ్చే వాసన అతి పెద్ద సమస్య’’ అని ట్వీట్ చేశారు. వీటిపై భారత్‌తోపాటు అంతర్జాతీయంగానూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో దిద్దుబాటు చర్యలకు దిగిన మాల్దీవుల (Maldives) ప్రభుత్వం.. ముగ్గురు మంత్రులపై వేటు వేసింది. సామాజిక మాధ్యమాల్లో వివాదాస్పద పోస్టులు పెట్టిన వారిని పదవి నుంచి తప్పించినట్లు మాల్దీవుల విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. మరియం షియునా, మాల్షాతోపాటు మరో మంత్రి హసన్ జిహాన్‌లను మంత్రి పదవుల నుంచి తప్పించినట్లు సమాచారం.
భారత్‌ను ఉద్దేశించి జహీద్ చేసిన వ్యాఖ్యలపై మాల్దీవులు విదేశాంగ శాఖ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘ఒక దగ్గర నేతను ఉద్దేశించి మా దేశానికి చెందిన కొందరు నాయకులు సామాజిక మాధ్యమాల్లో చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వం దృష్టికి వచ్చాయి. వాటితో మాల్దీవులు ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. అవి పూర్తిగా వారి వ్యక్తిగతం. భావవ్యక్తీకరణ స్వేచ్ఛను బాధ్యతాయుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఉపయోగించాలని మాల్దీవులు ప్రభుత్వం విశ్వసిస్తోంది. అంతర్జాతీయ భాగస్వాములతో ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినేలా విద్వేషపూరిత, వ్యతిరేక వ్యాఖ్యలు చేయకూడదు. అలాంటి వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకునేందుకు మా ప్రభుత్వం వెనుకాడదు’’ అని ప్రకటనలో తెలిపింది.
మరోవైపు మోడీపై.. మాల్దీవుల మంత్రుల కామెంట్లపై భారతీయ నెటిజన్లు మండిపడుతున్నారు. పర్యాటకంగా ఆ దేశాన్ని బహిష్కరించాలని కామెంట్లు చేస్తున్నారు. బాయ్ కాట్ మాల్దీవులు హ్యాట్ ట్యాగ్ విపరీతంగా ట్రోల్ అవుతోంది.భారత్ నుంచి ఏటా ఎంతో మంది ఆ దేశంలో పర్యటిస్తుంటారు. ఈ నేపథ్యంలో మంత్రుల వ్యాఖ్యలు అక్కడి పర్యాటక రంగంపై ప్రభావం చూపించే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.











































































