‘డ్రాగన్’ వలలో మాల్దీవులు..?

భారత్ -మాల్దీవుల మధ్య దూరం మరింతగా పెరుగుతోందా? ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అదే అనిపిస్తోంది. ఇటీవలే మాల్దీవుల నూతన అధ్యక్షుడిగా నియమితులైన మహ్మద్ ముయిజ్జూ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను పదవీ బాధ్యతలు చేపట్టిన వారం రోజుల్లోనే మాల్దీవుల నుంచి భారత సైన్యాన్ని బహిష్కరిస్తానన్నారు. తాను అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తొలిరోజే మాల్దీవుల నుంచి వైదొలగాలని భారత సైనికులను అభ్యర్థిస్తానని ఆయన తెలిపారు. భారత సైన్యాన్ని మాల్దీవుల నుంచి బహిష్కరించడమే తన ప్రధాన లక్ష్యమని అన్నారు. అయితే.. ఈ అంశం వివాదాస్పదం అవ్వకుండా, దౌత్య మార్గాల ద్వారానే పరిష్కరిస్తానని అన్నారు.
కొన్ని రోజుల క్రితమే నేను భారత హైకమిషనర్‌ను కలిశాను. భారత సైన్యాన్ని తిరిగి భారత్‌కు పంపే విషయాన్ని ఆయనతో ప్రస్తావించాను. ఇదే మా అత్యంత ప్రాధాన్యమైన అంశమని తెలిపాను. అందుకు వాళ్లు సానుకూలంగానే సమాధానం ఇచ్చారు. దీనిపై కలిసి పని చేద్దామని, ఈ అంశంపై ముందుకెళ్లే మార్గాన్ని కనుగొందామని చెప్పారు అని తెలిపారు. అయితే.. మాల్దీవుల్లో ఎంతమంది భారత సైనికులు ఉన్నారన్న అంశంపై…కచ్ఛితమైన సంఖ్య మాత్రం తనకు తెలియదని ముయిజ్జూ వెల్లడించారు. కొన్ని శతాబ్దాల నుంచి తమది శాంతియుత దేశంగా ఉందని, తమ గడ్డపై విదేశీ దళాలు ఎప్పుడూ లేవని చెప్పారు. ఒకవేళ విదేశీ దళాలు తమ గడ్డపై ఉంటే.. తాము సురక్షితంగా లేమన్న భావన కలుగుతుందని ఆయన వివరించారు.
ఇదే సమయంలో మాల్దీవుల విదేశాంగ విధానం చైనా వైపు మొగ్గు చూపుతుందా? అని ప్రశ్నించినప్పుడు.. తాను మాల్దీవుల అనుకూల విధానాన్ని అనుసరిస్తానని జవాబిచ్చారు. ఇతర దేశాల్ని ప్రసన్నం చేసుకునేందుకు తాము ఏ దేశం పక్షం వహించమని తేల్చి చెప్పారు. తమ దేశ ప్రయోజనాల్ని కాపాడుకోవడమే తమ మొదటి లక్ష్యమని తెలిపారు. దానిని గౌరవించే ఏ దేశమైనా తమకు మిత్రదేశంగా ఉంటుందని ముయిజ్జూ చెప్పుకొచ్చారు. కాగా.. మొహమ్మద్ మొయిజ్జును చైనాకు మద్దతుదారుగా పరిగణిస్తారు. గత నెలలో ఆయన ఇబ్రహీం సోలిహ్‌ను ఓడించారు. ముయిజ్జూ ఎన్నికల వాగ్ధానాల్లో భారత సైన్యాన్ని మాల్దీవుల నుంచి తిరిగి వెనక్కు పంపడం ఉంది.
ఈ పరిణామాల నేపథ్యంలో కొత్త ప్రభుత్వాన్ని భారత వ్యతిరేక కార్యక్రమాలు కొనసాగించకుండా చేయడం, విదేశాంగ విధానానికి ఒక సవాలు. ఇప్పటికే హిందూ మహాసముద్రంలో మయాన్మార్ నుండి జిబౌటి వరకు తన ఆర్థిక, సైనిక, వ్యూహాత్మక ప్రభావాన్ని విపరీతంగా పెంచుకున్న చైనాను కట్టడి చేయడం అంత తేలిక కాదు. భారత్, చైనా మధ్య ఈ ప్రాంతంలో నెలకొన్న పోటీలో మాల్దీవులు ముఖ్య భూమికను పోషిస్తాయి, 2013లో అమెరికా మాల్దీవులతో సైనిక ఒప్పందాలు చేసుకోవడానికి చేసిన ప్రయత్నాలను, భారత్ అడ్డుకుంది. అయితే… 2020లో అదే భారత్…అమెరికా, మాల్దీవుల సైనిక ఒప్పందానికి సానుకూలత వ్యక్తం చేసింది. మాల్దీవులకు సుమారు 1,800 కిలోమీటర్ల దూరంలో ఉన్న డిగో గరిసియ అమెరికా మిలిటరీ స్థావరం ఏర్పాటును గతంలో తీవ్రంగా వ్యతిరేకించిన భారత్.. మారుతున్న పరిస్థితులకు తగినట్లుగానే స్వాగతించింది. ఈ ఒప్పందాలు చైనా ప్రభావాన్ని నిలువరించడంలో సహాయపడతాయని భావిస్తోంది.











































































