ట్రంప్ తో మస్క్ క్రేజీక్రేజీ ఇంటర్వ్యూ…!
అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ రాజకీయం మరింత రసవత్తరంగా మారుతోంది. అటు అధ్యక్ష అభ్యర్థుల ప్రచారం కూడా మరింత జోరందుకుంది. తాజాగా రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఓ ఆసక్తికర ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆయనను ఇంటర్వ్యూ చేసింది మరెవరో కాదు.. టెస్లా, స్పేస్ఎక్స్ సంస్థల అధినేత, బిలియనీర్ ఎలాన్ మస్క్ . ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షుడు పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
బైడెన్‌ను ఓడించడంతోనే రంగంలోకి కమలా హ్యారిస్..
‘‘ఇటీవల బైడెన్‌తో నేను చేసిన డిబేట్.. నా గొప్ప చర్చల్లో ఒకటిగా భావిస్తున్నా. ఆ డిబేట్లో ఆయనను ఘోరంగా ఓడించా. ఫలితంగా ఆయనను అధ్యక్ష రేసు నుంచి పంపించేశారు. వారి పార్టీలో తిరుగుబాటు కారణంగానే బైడెన్ వైదొలగాల్సి వచ్చింది’’ అని ట్రంప్ విమర్శించారు.
ప్రత్యర్థుల గురించి ట్రంప్..
‘‘వ్లాదిమిర్ పుతిన్ (రష్యా అధ్యక్షుడు), షీ జిన్‌పింగ్ (చైనా అధినేత), కిమ్ జోంగ్ ఉన్ (ఉత్తరకొరియా అధ్యక్షుడు) వారు తమ తమ ఆటల్లో టాప్‌లో ఉన్నారు. వారంతా తమ దేశాలను ప్రేమిస్తున్నారు. అయితే, వారిది భిన్నమైన ప్రేమ. వారిని ఎదుర్కోవడానికి అమెరికాకు బలమైన అధ్యక్షుడు కావాలి. అధ్యక్షుడిగా బైడెన్ లేకపోయి ఉంటే.. ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసేదే కాదు. పుతిన్‌తో చాలా సార్లు మాట్లాడా. ఆయన నాకు చాలా గౌరవమిస్తారు. ఉక్రెయిన్ గురించి కూడా మేం చర్చించుకున్నాం’’ అని ట్రంప్ చెప్పారు.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌పై అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బిలయనీర్, టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ ఇంటర్వ్యూలో భాగంగా డొనాల్డ్ ట్రంప్ మాట్లాడారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడికి జో బైడెన్ వైఖరే కారణమని ట్రంప్ ఆరోపించారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ ఉదాసీనత దీనికి కారణమని విరుచుకుపడ్డారు. అదేవిధంగా జో బైడెన్ కారణంగా హంతకులు, డ్రగ్ డీలర్లు యూఎస్ లోకి అడుగుపెడుతున్నారని ట్రంప్ ఆరోపించారు.
కమలా హ్యారిస్ ను విధ్వంసకారిణిగా ట్రంప్ అభివర్ణించారు. ఆమె శాన్ ఫ్రాన్సిస్కో సిటీని ఆతర్వాత కాలిఫోర్నియా రాష్ట్రాన్ని నాశనం చేశారని ఆరోపించారు.ఇప్పుడు అమెరికా అధ్యక్షురాలిగాఎన్నికైతే దేశానికి అదేగతి పడుతుందని హెచ్చరించారు.ఇటీవల ట్రంప్..కమలాహారిస్ పై నోరుపారుసుకున్నారు. కమలాహారిస్ ఓ ఫ్రాడ్ అంటూ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. ఎక్స్ లో పోస్టు చేసిన ర్యాలీకి సంబంధించిన ఫొటోల్లో కమలాహారిస్ ఏఐను ఉపయోగించి జనం ఎక్కువగా ఉన్నట్లు చూపించారని ట్రంప్ ఆరోపించారు.






