డ్రాగన్ అటెన్షన్..
ప్రధాని మోదీ అమెరికా పర్యటనపై చైనాలో ఆందోళన కనిపిస్తోంది. అమెరికా -భారత్ మధ్య సంబంధాలు మరింత బలోపేతం కావడం.. ఆసియా ఖండంలో తమ ఆధిపత్యానికి విఘాతం అన్న కోణంలో చైనా సర్కార్ చూస్తోంది. దీంతో చైనా ప్రభుత్వ ఆధ్వర్యంలోని మీడియా సంస్థ అమెరికాపై విమర్శలు గుప్పించింది. భారత్‌ను ఎగదోస్తోందని, బీజింగ్‌కు వ్యతిరేకంగా న్యూదిల్లీని ఒక అడ్డుగోడలా ఉపయోగించుకోవాలని వాషింగ్టన్ భావిస్తోందని ఆరోపించింది.
ప్రపంచ సరఫరా గొలుసులో చైనా స్థానాన్ని భారత్ సహా మరే ఆర్థికవ్యవస్థ భర్తీ చేయలేదని చైనా దౌత్యవేత్తలు చెబుతున్నారు. అమెరికా వేసే భౌగోళిక రాజకీయ లెక్కల్ని తెలుసుకోవడం పెద్ద కష్టమేమీ కాదన్నారు.. దిల్లీతో ఆర్థిక, వాణిజ్య సహకారాన్ని బలోపేతం చేయడానికి వాషింగ్టన్ చేస్తోన్న తీవ్ర ప్రయత్నాలు ప్రధానంగా చైనా ఆర్థిక అభివృద్ధిని దెబ్బతీయడం కోసమే అని ఆరోపించారు.. ఆ రెండు దేశాలు ఆర్థిక, వాణిజ్య భాగస్వామాన్ని మరింత బలోపేతం చేసుకోవాలనుకుంటే.. చైనాను లక్ష్యంగా చేసుకోవడానికి బదులు ముందుగా రెండింటి మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. గ్లోబల్ టైమ్స్ పత్రికలో చైనా అత్యున్నత దౌత్యవేత్త వాంగ్ ఈ అమెరికా తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు.
అదే సమయంలో భారత్ కు చైనా కొన్ని హెచ్చరికలు చేసింది. మరీ ముఖ్యంగా అమెరికా మాటలు మాత్రమే చెబుతుందని.. వాటిలో దేన్ని పాటించదని తెలిపింది. చైనాను నియంత్రించేందుకు అమెరికా ఆడుతున్న ఆటలనకు దూరంగా ఉండాలని కోరింది.చైనాతో ఆర్థిక, వాణిజ్య సహకారాన్ని ప్రోత్సహించడం భారత వృద్ధికి ఎంతో ముఖ్యమని వ్యాఖ్యానించింది. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ చైనా పర్యటనలో ఉన్న సమయంలో ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి.
అంతే కాదు.. అమెరికా చర్యలపై భారత్ లోని ప్రముఖుల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోందని అధికార మీడియా రాసుకొచ్చింది.అమెరికా వేస్తోన్న భౌగోళిక, రాజకీయ లెక్కలు విఫలమవుతున్నాయని తెలిపింది. అమెరికాతో అంటకాగే బదులు.. తమతో సానుకూలంగా ఉండేందుకు ప్రయత్నాలు చేయాలని పరోక్షంగా సూచించింది. ఏదేమైనా అమెరికాలో ప్రధాని మోదీ పర్యటన.. అగ్రరాజ్యం ఇస్తున్న ఇంపార్టెన్స్… చైనాను ఆందోళనకు గురిచేస్తోంది.






