చేతులు కాలాక..

భారత్-పాకిస్తాన్ లకు ఒక్కరోజు తేడాలో స్వాతంత్రం వచ్చింది. రెండు దేశాలు పేదరికంతోనే పాలన ప్రారంభించాయి. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడిచాయి. ఇప్పుడు రెండు దేశాలను పరిశీలిస్తే, భారత్ ..చంద్రుడిపై పాదం మోపింది, జి-20 సదస్సు విజయవంతంగా నిర్వహించింది. ప్రపంచదేశాలకు నమ్మదగిన మిత్రదేశంగా మారింది. అంతర్జాతీయంగా కీలక నిర్ణయాల్లో భాగస్వామ్యం కలిగి ఉంటోంది. భారత నిర్ణయాలను ప్రపంచ దేశాధినేతలు మన్నిస్తున్నారు. భారత్‌తో సంబంధాలకు అధిక ప్రాధాన్యమిస్తున్నారు
పాకిస్తాన్ మాత్రం తీవ్రమైన ఆర్థిక సమస్యలతో కునారిల్లుతోంది. విపరీతంగా పెరిగిపోయిన లంచగొండితనం, పేదరికం, నింగినంటిన ద్రవ్యోల్బణం.. సామాన్యుడి బతుకు దుర్భరంగా మారింది. అసలే ఉద్యోగాలు, ఉపాధి లేక జనం ఇబ్బందులు పడుతుంటే.. పెరిగిన ధరలు వారి జీవితాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. దీంతో పాకిస్తాన్ సర్కార్ పై .. ఆదేశ ప్రజలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఓవైపు పొరుగుదేశం భారత్ అభివృద్ధి దిశగా పురోగమిస్తుంటే… మనం మాత్రం ఇలాంటి దిక్కుమాలిన బతుకులీడుస్తున్నామంటూ .. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
ఇటీవలే ఆదేశ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సైతం .. పాక్ పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేశారు. భారత్ చంద్రమండలంపైకి వెళ్తుంటే.. పాక్ పక్క దేశాలను అడుక్కుంటోందని పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ అన్నారు. పాకిస్థాన్‌ను పాలించిన గత ప్రధానులు అవినితీకి పాల్పడి.. దేశాన్ని గందరగోళ పరిస్థితుల్లో నెట్టివేశారని ఆరోపించారు. మన పక్కనే ఉన్న భారత్.. చంద్రమండలంపైకి వెళ్లింది. జీ20 వంటి ప్రపంచ సమ్మిట్లకు వేదికగా మారింది. పాక్ ఎందుకు సాధించలేదు. ఈ దుస్థితికి కారణం ఎవరు..? వాజ్‌పేయీ కాలంలో భారత్ వద్ద నిల్వలు చాలా తక్కువగా ఉండేవి. ప్రస్తుతం వారి నిల్వలు 600 బిలియన్ డాలర్ల వరకు చేరాయి.’ అని లాహోర్ వేదికగా జరిగిన బహిరంగ సభలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లండన్ నుంచి మాట్లాడారు.
భారత్ ఆర్థికాభివృద్ధి సాధించడం, పేదరికంపై పోరాడుతుంటే.. పాకిస్తాన్ మాత్రం విద్వేషాన్ని నమ్ముకుంది. పొరుగున ఉన్న భారత్‌పై విద్వేషాగ్ని రగిల్చింది. కశ్మీరంలో మంటలు రగల్చడంతో పాటు ఉగ్రవాద తండాల్ని పెంచిపోషించింది. ఇప్పుడు అవి కాస్త పాముల్లా మారి కాటేస్తున్నాయి. పోనీ ఆ దేశ పాలకులు..ఆర్థికాభివృద్ధి దిశగా చర్యలు తీసుకున్నారా అంటే అదీ లేదు. దీంతో .. ఆదేశం తీవ్రమైన అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఇప్పుడు పాక్ పాలకులు ఎక్కడకు వెళ్లినా.. వారికి తగిన గౌరవం దక్కడం లేదు. ఇదే విషయాన్ని పాక్ ప్రస్తుత ప్రధాని షెహబాజ్ కూడా అంగీకరించారు. మరి పాక్ ఈ ఆపద నుంచి ఎలా గట్టెక్కుతుందో వేచి చూడాలి.











































































