ప్రపంచ రికార్డును సృష్టించిన విశాఖ బాలిక
సముద్రమట్టానికి 20,180 అడుగుల (6,153మీ) పైన గడ్డ కట్టే మంచుతో ఉండే స్టాక్ కాంగ్రీ పర్వతాన్ని అధిరోహించి విశాఖకు చెందిన తొమ్మిదేళ్ల బాలిక కామ్యా కార్తికేయన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. తూర్పు నౌకాదళం కమాండర్ కార్తికేయన్ కుమార్తె కామ్యాకు చిన్ననాటి నుంచి పర్వతారోహణపై మక్కువ. దేశంలోని పలు పర్వతాలను బాలిక అధిరోహించింది. పర్వతారోహణంలో ప్రావీణ్యం ఉన్న తల్లిదండ్రుల శిక్షణలోనే కామ్యా రాటుదేలింది. వీరు మరో 40 మందితో కలిసి హిమాలయాల్లోని స్టాక్ కాంగ్రీ పర్వతారోహణకు ఈ నెల 4న శ్రీకారం చుట్టారు. తొలుత గత నెల 29న లెహ్ పట్టణానికి చేరుకున్న వీరు అక్కడే ఉండి స్థానిక వాతావరణానికి అలవాటుపడ్డారు. నాల్గో తేదీన స్టాక్ అనే గ్రామం నుంచి పర్వతారోహణ మొదలుపెట్టారు. మంచుకొండల్లో ప్రమాదకర మార్గాల్లో ప్రయాణించారు. మంచు కారణంగా పలుచోట్ల మార్గాన్ని గుర్తించడం కష్టమైనప్పటికీ మొక్కవోని దీక్షతో ముందుకు సాగారు. తొలిరోజు 16 కిలోమీటర్లు నడిచి 4500 మీటర్ల ఎత్తులో ఉన్న మన్కార్మో ప్రాంతానికి చేరుకున్నారు. దశలవారీగా రాత్రి పగలు తేడాలేకుండా ప్రయాణిస్తూ ఏడోతేదీ ఉదయం 9:45 గంటలకు 20,180 అడుగుల ఎత్తున స్టాక్ కాంగ్రీ పర్వత శిఖరాగ్రానికి చేరుకున్నారు. వాతావరణ పరిస్థితులకు తట్టుకోలేక ఈ ప్రయాణంలో పలువురు మధ్యలోనే వెనక్కి మళ్లారు. చివరకు బాలికతో సహా 15 మంది మాత్రమే చేరుకోగలిగారు.













