త్రిఫల షర్బత్ సిద్ధం
సహజసిద్ధమైన, ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలిగించే త్రిఫల షర్బత్ దేశీయ మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. గిరిజన సహకార సంస్థ (జిసిసి) బ్రాండ్ ద్వారా వస్తున్న త్రిఫల షర్బత్.. కరక్కాయ, తానికాయ వంటి అటవీ ఉత్పత్తులతో తయారవుతోంది. ఈ నెల 26వ తేదీన దీన్ని ఆంధ్ర రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనంద్ బాబు ప్రారంభిస్తారు. ఏపి, తెలంగాణ రాష్ట్రాల్లో దీన్ని మార్కెటింగ్ చేస్తారు. కాగా, 750 ఎంఎల్ త్రిఫల షర్బత్ సీసాను కేవలం 160 రూపాయలకే విక్రయించాలని జిసిసి నిర్ణయించింది. తానికాయ, కరక్కాయ, ఉసిరి వంటి వాటి నుంచి తీసిన ద్రావకంలో కాస్తంత తేనే, చక్కెర మిశ్రమాలను కలిపి తయారు చేసే దీన్ని సేవించడం ద్వారా ఉల్లాసాన్ని పొందగలుగుతారు. చిన్నచిన్న రుగ్మతలను మటుమాయం చేయగలిగే శక్తి త్రిఫల షర్బత్‌లో ఉంటుంది. అయతే దీని ప్రయోజనాలు, ఏ విధంగా ఉపయోగించాలి? వంటి వివరాలు షర్బత్ సీసాపైన ముద్రిస్తామని సంస్థ తెలిపింది.













