యూపీలో యోగికి ఢోకా లేదని నిరూపించిన ఎన్నికలు
ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికారంవైపుగా భారతీయ జనతా పార్టీ దూసుకెళుతోంది. అన్నీ పత్రికలు, విపక్ష రాజకీయ పార్టీలు, మేధావులు అంతా యుపిలో బిజెపి ఓటమి ఖాయమని చెప్పినప్పటికీ సామాన్య పౌరులు, ముఖ్యంగా మహిళలు ప్రస్తుత యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాలనకే తమ ఓటును వేసి మరోసారి ఆ పాలనను స్వాగతించినట్లు కనిపిస్తోంది. దానికితోడు మహిళలు భద్రంగా ఉండాలంటే యోగిపాలనలో అది జరుగుతుందని నమ్మిన సామాన్య మహిళలు మరోసారి తమ భద్రతకోసం యోగికే ఓటు వేశారు. అదే సమయంలో కరోనా సమయంలో ఇతర ఊర్ల నుంచి యుపికి వచ్చిన వేలాదిమంది వలస కూలీలలకు ఉచితంగా కిరాణ సరకులను ఇచ్చి వారి ఆకలి తీర్చిన యోగిని వారు మరిచిపోలేదు. తమ ఆకలి తీర్చిన ఆ పాలనే తమకు మళ్ళీ కావాలన్నట్లుగా యోగి పాలనకే మరోసారి తమ ఓటును వేసి పాలక బిజెపికి అధికారాన్ని తిరిగి కట్టబెట్టినట్లు కనిపిస్తోంది.
దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో అందరిని ఉత్కంఠకు గురిచేసిన ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో మరోసారి బీజేపీదే విజయం అని తేలిపోయింది. మెజార్టీని మించి స్థానాలను ఆ పార్టీ కైవసం చేసుకోబోతోంది. తాజాగా అందుతున్న ఫలితాల్లో బీజేపీ దే హవా నడిచింది. మరోసారి సీఎం యోగి ఆదిత్యనాథ్కే సీఎంగా ప్రజల మరోసారి పట్టం కట్టబోతున్నారు. ఇదివరకూ ఎంపీగా గెలిచిన యోగి తొలిసారి తన సొంత నియోజకవర్గం గోరఖ్ పూర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీచేశాడు. దేశ రాజకీయాల్లో కేంద్రంలో అధికారంలోకి రావాలంటే అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ లో గెలుపు చాలా కీలకం. ఈ రాష్ట్రంలో ఎవరిది గెలుపు అయితే వారిదే కేంద్రంలో అధికారం. యూపీ ప్రజల నాడిని బట్టే దేశ రాజకీయాలు ఉంటాయి. అయితే రైతుల ఉద్యమం ఉత్తరప్రదేశ్ లో అత్యాచారాలు రైతులపై కేంద్రమంత్రి కుమారుడు రైతులను తొక్కించి చంపడం వంటి కారణాలు కూడా బీజేపీ ఓటమికి కారణం అవుతాయని అంతా భావించారు. కానీ అలాంటివేమీ పెద్దగా పనిచేయడం లేదని తాజాగా వెలువడుతున్న ఫలితాల సరళిని బట్టి అర్థమవుతోంది.
యోగి ఆదిత్యనాథ్ పై వ్యతిరేకత లేదని.. ఆయన పాలన మెరుగ్గా ఉందని మరోసారి యూపీ ప్రజలు స్పష్టం చేశారు. యూపీ సీఎంగా మరోసారి అవకాశం ఇఛ్చారు. అంతటి వ్యతిరేకతలోనూ యూపీలో బీజేపీని గెలిపించిన యోగి స్టామినా గ్రేట్ అనే పేర్కొనవచ్చు.













