యూపీ సీఎం గా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణస్వీకారం
ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి రెండోసారి యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారం చేశారు. లఖ్‌నవూలోని అటల్ బిహారీ వాజ్‌పేయీ ఎకానా స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ ఆనందీబెన్ పటేల్, యోగితో ప్రమాణం చేయించారు. ఈ వేడుకకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గతంలో మాదిరిగానే ఈసారి కూడా ఇద్దరికి ఉపముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించారు. కేశవ్ ప్రసాద్ మౌర్యతో పాటు బ్రజేశ్ పఠక్ ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణం చేశారు. వీరితో పాటు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, స్మృతి ఇరానీ, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు తదితర పార్టీ అగ్రనేతలు హాజరయ్యారు. ఎకానా స్టేడియంలో జరిగిన యోగి ప్రమాణ స్వీకారానికి పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు.













