ఎట్టకేలకు యడియూరప్ప విజయం సాధించారు
ఎట్టకేలకు సీఎం యడియూరప్ప కోరికను అధిష్ఠానం నెరవేర్చేసింది. కేబినెట్ విస్తరణకు బీజేపీ హైకమాండ్ సరేనంది. ఎప్పటి నుంచో కేబినెట్ విస్తరణ చేస్తానని, అందుకు తమ అనుమతి కావాలని యడియూరప్ప అధిష్ఠానాన్ని వేడుకున్నారు. అయినా అధిష్ఠానం మాత్రం పచ్చ జెండా ఊఫలేదు. చివరికి మొన్న సరేనని తలూపింది. ఎట్టకేలకు యడియూరప్ప తన కోరికను నెరవేర్చుకున్నారు. మొత్తం ఏడుగురితో ప్రమాణం చేయించి, కేబినెట్లోకి తీసుకోగా, అందులో నలుగురు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు. ఉమేశ్ కట్టి, ఎస్. అంగర, మురుగేశ్ నిరానీ, అరవింద్ లింబావలీ, ఆర్. శంకర్, ఎంటీబీ నాగరాజ్, సీపీ యోగేశ్వర్ మంత్రులుగా ప్రమాణం చేశారు.
యడియూరప్పపై తీవ్రంగా విరుచుకుపడ్డ సొంత ఎమ్మెల్యేలు
నూతనంగా ప్రమాణం చేసే మంత్రుల జాబితాను యడియూరప్ప విడుదల చేయడమే ఆలస్యం… సొంత ఎమ్మెల్యేలు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. సీడీలతో బ్లాక్మెయిల్ చేసిన వారిని, విధేయులనే మంత్రివర్గంలో చేర్చుకున్నారని ఆరోపించారు. అంతేకాకుండా ఆ జాబితాలో సీఎంకు సొమ్ములు ముట్టజెప్పిన వారూ ఉన్నారని తీవ్రంగా దుయ్యబట్టారు. విధేయత, కులం తదితర అంశాలను పరిశీలించకుండానే, మా వంటి కార్యకర్తలను పక్కనకు నెట్టేశారని బసవగౌడ మండిపడ్డారు. అయితే ఈ ఆరోపణలపై సీఎం యడియూరప్ప తీవ్రంగా మండిపడ్డారు. ‘‘మంత్రివర్గ విస్తరణపై మీకేమైనా అభ్యంతరాలుంటే హైకమాండ్‌కు చెప్పుకోండి. నాతో కాదు. నిరాధార ఆరోపణలు చేయకండి. అలాంటి ఆధారాలు మీవద్ద ఉంటే హైకమాండ్‌కు ఫిర్యాదు చేసుకోండి. అంతేకానీ… పార్టీ ఇమేజ్ను దెబ్బతీయకండి.’’ అని ఘాటుగా హెచ్చరించారు.
నాయకత్వ మార్పు అంటూనే…. విస్తరణకు అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్
నిజానికి ఈసారి బీజేపీ అధిష్ఠానం సీఎంనే మార్చేస్తోందన్న ఊహాగానాలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. సీఎం యడియూరప్ప స్థానే ఇతరులను సీఎం కుర్చీపై కూర్చోబెట్టనుందని వార్తలొచ్చాయి. వచ్చే ఎన్నికల నాటికి కొత్త సీఎంతో ఎన్నికల గోదాలోకి ప్రవేశించాలని అధిష్ఠానం నిర్ణయించుకుంది. ఇందుకు సంబంధించి పూర్తి కసరత్తును కూడా పూర్తి చేసేసింది. అందుకే యడియూరప్ప కేబినెట్ విస్తరణకు ఇన్ని రోజులుగా అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని బెంగళూరు వర్గాలు పేర్కొన్నాయి. అంతేకాకుండా కొన్ని రోజులుగా సీఎం యడియూరప్ప వ్యవహార శైలిపై అధిష్ఠానం తీవ్ర అసంతృప్తిగానూ ఉంది. కనీసం అధిష్ఠానం పెద్దలు ఆయనకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. అయినా… యడియూరప్ప ఎక్కడా వెనక్కి తగ్గలేదు. తన పరపతిని, తిరుగులేని తనాన్ని మరోసారి నిరూపించుకున్నారు. దీని ద్వారా అసంతృప్త ఎమ్మెల్యేలకు గట్టి ఝలక్ ఇచ్చారు. కేబినెట్ విస్తరణ పదే పదే వాయిదా పడుతూ ఉండడంతో ఇక యడియూరప్ప పని అయిపోయిందని, కొత్త సీఎం రెడీ అయిపోయారని ఆయన ప్రత్యర్థులు తెగ సంబరపడిపోయారు. కానీ… ఒకే ఒక్క ఢిల్లీ పర్యటనతో యడియూరప్ప అందరి నోళ్లూ మూయించేశారు.
‘పొంగల్’ లో రాజకీయం కలిసింది….
ఈసారి చెన్నైకి ‘పొంగల్ అతిథులు’ వచ్చారు. ఆ ముగ్గురూ ముఖ్య అతిథులే. అయితే… ఆతిథ్యాన్ని వారే కోరి రావడం ఇక్కడ విశేషం. ఆ ముగ్గురిలో ఒకరు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సరసంఘ చాలక్ మోహన్ రావ్ భాగవత్ కాగా, మరొకరు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, మూడో నేత కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. ఈ ముగ్గురు కీలక నేతలూ పొంగల్ రోజున చెన్నైలో పర్యటించడం విశేషం. ఈ ముగ్గురూ తమిళ సంస్కృతిని, ప్రజానీకాన్ని పొగడ్తలతో ముంచెత్తారు. తమిళనాడులో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ముగ్గురు ప్రముఖుల పర్యటనకు విశేష ప్రాధన్యం ఏర్పడింది. ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ కదంబుడీ చిన్నమ్మన్ ఆలయంలో గోపూజలు నిర్వహించారు. ఆ తర్వాత జరిగిన సమావేశంలో మాట్లాడుతూ…. ‘తాము ఎప్పుడూ తమిళ ప్రజల పక్షం వహిస్తాం. తమిళనాట పొంగల్ మూడు రోజుల పండుగ. దేశంలో ఎక్కడా లేదు. అదే తమిళ ప్రజల ప్రత్యేకత. ఈ పండగకు కొత్త పంట చేతికొస్తుంది. లక్ష్మీదేవి, సూర్యుడి పూజలు చేస్తారు.’’ అంటూ తమిళ సంస్కృతిని ఉటంకిస్తూ ప్రసంగించారు. ఒక్క రాహుల్ గాంధీ తప్ప, మిగితా ఇద్దరు నేతలూ తమిళ సంప్రదాయ దుస్తులు ధరించే కార్యక్రమంలో పాల్గొన్నారు.













