తృణమూల్ లోకి యశ్వంత్ సిన్హా
కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ మాజీ నేత యశ్వంత్ సిన్హా శనివారం తృణమూల్ కాంగ్రెస్లో చేరారు. టీఎంసీ నేతలు సుదీప్ బందోపాధ్యాయ, డెరెక్ ఓ బ్రెయిన్ సమక్షంలో సిన్హా తృణమూల్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. దేశంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, ప్రభుత్వ సంస్థలు బలంగా ఉంటేనే ప్రజాస్వామ్యం కూడా బలంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. దేశంలో రానూరానూ ప్రజాస్వామ్య వ్యవస్థలు నిర్వీర్యమైపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు న్యాయ వ్యవస్థ కూడా మినహాయింపు కాదన్నారు. వాజ్పాయ్ కాలంలో ఉన్న పరిస్థితులు ప్రస్తుతం బీజేపీ లేవని విమర్శించారు. ప్రస్తుతం అణచివేతే ఏకైక లక్ష్యంతో బీజేపీ సాగుతోందని మండిపడ్డారు. మిత్రపక్షాలు ఒక్కొక్కటీ బీజేపీ దూరమవుతున్నాయని, అకాలీదళ్, బీజేడీ ఇప్పటికే దూరమయ్యాయని గుర్తు చేశారు. సీఎం మమతా బెనర్జీ ఓ ఫైటర్ అని ప్రశంసించారు.
అటల్ ప్రభుత్వంలో మమత, తాను కలిసే పనిచేశామని, అప్పటి నుంచీ మమతది పోరాటమేనని ప్రశంసించారు. ఇండియన్ ఏయిర్ లైన్స్ విమానాన్ని ఉగ్రవాదులు హైజాక్ చేసి కాందహార్ తీసుకెళ్లినపుడు, దానిపై మంత్రివర్గంలో చర్చ జరిగిందని వెల్లడించారు. ఉగ్రవాదుల చెరలో ఉన్న వారిని విడుదల చేయాలన్న షరతుతో తాను బందీగా వెళ్తానని మమత చెప్పారని యశ్వంత్ వెల్లడించారు. తృణమూలే తిరిగి అధికారంలోకి వస్తుందని పేర్కొన్నారు. మోదీ, షా ఢిల్లీ నుంచే దేశాన్ని నడుపుతున్నారని, దీనిని దేశం సహించదన్న సంకేతాలను బెంగాల్ ప్రజలు ఇస్తారని సిన్హా పేర్కొన్నారు.













