అండర్-19 వరల్డ్ కప్ విజేతలకు ఘన స్వాగతం
అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో భారత జట్టు అదరగొట్టిన విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికాలోని పోచెఫ్‌స్ట్రూమ్ వేదికగా జరిగిన ఫైనల్లో ఇంగ్లాండ్‌పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అద్వితీయ విజయం అనంతరం జట్టు సభ్యులంతా స్వదేశంలో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న భారత జట్టు అమ్మాయిలకు ఘన స్వాగతం లభించింది. కుటుంబ సభ్యులు, అధికారులు, అభిమానులు విజేతలకు పూలతో స్వాగతం పలికారు. కాగా హైదరాబాద్‌కు చెందిన క్రీడాకారులకు శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. తెలంగాణ రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఇతర అధికారులు, కుటుంబ సభ్యులు పుష్పగుచ్చాలు ఇచ్చి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా క్రీడాకారులు వరల్డ్ కప్‌లో తమకు ఎదురైన అనుభవాలను పంచుకున్నారు. మొదటి టీ20 వరల్డ్ కప్‌లో ఉండటం, కప్పు గెలవడం చాలా సంతోషంగా ఉందన్నారు. క్రికెట్ మాత్రమే కాకుండా ప్రతీ క్రీడలో మహిళలు ధైర్యంగా ముందుకు రావాలన్నారు.













