మోదీ కాళ్లు మొక్కడానికి సిద్ధమే : మమతా బెనర్జీ

కోల్‌కతా : ప్రధాని మోదీని ఉద్దేశించి సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కాళ్లు మొక్కితేనే బెంగాలీలకు సహాయం చేస్తానని మోదీ అంటే, మోదీ కాళ్లు మొక్కడానికి కూడా తాను సిద్ధంగానే ఉన్నానని వ్యాఖ్యానించారు. కాళ్లు మొక్కడానికి కూడా తాను సిద్ధమని, అంతేగానీ తమపై వివక్షను చూపించవద్దని మమత కోరారు. ‘‘నా కాళ్లు మొక్కితే నేను బెంగాలీలకు సహాయం చేస్తానని ప్రధాని మోదీ అంటే, అందుకు నేను సిద్ధమే. ప్రధాని కాళ్లు మొక్కడానికి కూడా సిద్ధం. అంతేగానీ తమపై వివక్షను చూపకండి’’ అని మమత సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు పీఎంవో అధికారులపై కూడా విరుచుకుపడ్డారు. పీఎంవో అధికారులు నకిలీ వార్తలను ప్రచారం చేస్తున్నారని బెనర్జీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. యాస్ తుపాను నష్టాన్ని అంచనా వేయడానికి ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం బెంగాల్‌లో పర్యటించారు. ఏరియల్ వ్యూ తర్వాత ఆయన అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అయితే ఈ సమావేశానికి సీఎం మమత 30 నిమిషాల పాటు ఆలస్యంగా వచ్చారని వార్తలొచ్చాయి. ఈ వార్తలపై మమతా బెనర్జీ శనివారం తీవ్రంగానే స్పందించారు.
‘‘నన్ను ఇలా అవమానించడం ఏమాత్రం భావ్యం కాదు. మేము తాజా అసెంబ్లీ ఎన్నికల్లో బంపర్ విక్టరీ సాధించాం. మాతో ఇలాగేనా ప్రవర్తించేది? ఎన్నికల్లో గెలవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఓడిపోయారు కూడా. ఇలా ప్రతిరోజూ మాతో ఎందుకు గొడవకు దిగుతున్నారు?’’ అంటూ సీఎం మమత సూటిగా ప్రశ్నించారు. జాతీయ మీడియాలో పనిచేస్తున్న వారు కొందరితో తనకు మిత్రత్వం ఉందని, తనను అవమానించే, తనపై పక్షపాత వార్తలు రాయమని పీఎంవో నుంచి వారికి ఆదేశాలు వెళ్తాయని మమత తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రధాని భద్రతను పర్యవేక్షించే ఎస్పీజీ భద్రతా సిబ్బంది గంట పాటు తనను వెయిట్ చేయించారని మమత ఆరోపించారు. సమీక్షా సమావేశానికి ఓ ఎమ్మెల్యేను (సుబేందు), ప్రతిపక్ష నేతను ఆహ్వానించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ప్రధాని పర్యటన వివరాలు వచ్చే సమయానికే తన పర్యటన షెడ్యూల్ ఖరారైందని, ఈ షెడ్యూల్ ఖరారైన తర్వాత తమకు ప్రధాని షెడ్యూల్ తెలిసిందని ఆమె పేర్కొన్నారు. అయినా ప్రతిసారీ ప్రధానికి ఓ సీఎం ఆహ్వానం పలకాలని ఏమీ లేదని దీదీ చురకలంటించారు.