ఎన్నికల నాటికి దీదీ ఒక్కరే ఉంటారు : షా
బెంగాల్ ప్రజలు సీఎం మమతా బెనర్జీని ఏమాత్రం క్షమించరని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్పు తెస్తానని పదే పదే చెప్పి, ఆ దిశగా ఏమాత్రం అడుగులు వేయలేదని ఆయన మండిపడ్డారు. హౌరాలో జరిగిన బహిరంగ సభలో వర్చువల్ గా అమిత్‌షా ప్రసంగించారు. ఎన్నికల సమయం నాటికి పార్టీలో ఒక్క దీదీ మాత్రమే మిగులుతారని ఎద్దేవా చేశారు. తృణమూల్ నేతలు వరుసగా బీజేపీలో చేరడానికి కారణం… ఆమె ప్రభుత్వ వైఫల్యమేనని ఆరోపించారు. వామపక్షాల పాలన కంటే మరీ అధ్వాన్నంగా తయారైందని మండిపడ్డారు. రాష్ట్రంలో దోపిడీ, అవినీతి పాలన సాగుతోందని, మమత ఆమె అల్లుడి కోసమే పనిచేస్తున్నారని తీవ్రంగా ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ కచ్చితంగా అధికారాన్ని జేచిక్కించుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ‘‘బెంగాల్ ప్రజలు దీదీని క్షమించరు. మార్పు తెస్తానని పదే పదే చెప్పి, హామీని విస్మరించారు. మాటి, మానుష్ నినాదాన్ని మరిచిపోయారు. దీదీ… బెంగాల్ ప్రజలు మిమ్మల్ని క్షమించరు.’’ అని షా తీవ్రంగా మండిపడ్డారు.
బీజేపీలో చేరిన మాజీ మంత్రి రాజీవ్ బెనర్జీ, తదితరులు
మాజీ మంత్రి రాజీవ్ బెనర్జీ, ఎమ్మెల్యేలు ప్రదీర్ ఘోషల్, బైశాలి దాల్మియా, మాజీ మేయర్ రతిన్ చక్రవర్తితో పాటు మరికొంత మంది కీలక నేతలు హోంమంత్రి షా సమక్షంలో బీజేపీలో చేరారు. అయితే శనివారమే వారందరూ బీజేపీలో చేరాల్సి ఉండింది. ఢిల్లీలో సంభవించిన కీలక పరిణామాల కారణంగా అమిత్‌షా పర్యటన రద్దైంది. దీంతో బెంగాల్‌కు ఓ ప్రత్యేక విమానం పంపించి, వారందర్నీ ఢిల్లీకి పిలిపించారు. ఢిల్లీలో వారిని బీజేపీలోకి ఆహ్వానించారు.













