జూలు విదిల్చి, పార్టీని తుడిచిపెట్టేస్తున్న సీఎం నితీశ్

బిహార్ రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. ఎప్పుడూ శాంతంగా ఉండే సీఎం నితీశ్ కుమార్ చేసిన ఆపరేషన్ లోక్‌జనశక్తి పార్టీని కకావికలం చేసేసింది. ఏకంగా చీలిక వైపుగా పార్టీ పయనిస్తోంది. దీంతో ఎల్జేపీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ ఒంటరివాడైపోయారు. లోక్‌సభలోని 6 గురు ఎంపీల్లో 5 గురు ఎంపీలు తిరుగుబాటు బావుగా ఎగరేశారు. లోక్‌సభలో తమను ఎల్జేపీ సభ్యులుగా కాకుండా, వేరుగా చూడాలని లోకసభ స్పీకర్ ఓం బిర్లాను అభ్యర్థించారు. తిరుగుబాటు చేసిన ఈ ఐదుగురు ఎమ్మెల్యేలకు ఎంపీ, చిరాగ్ పాశ్వాన్ మేనమామ పశుపతి కుమార్ పరాస్ నేతృత్వం వహిస్తున్నారు. వీరందరూ అధికార జేడీయూలో చేరనున్నట్లు తెలుస్తోంది.
ఈ పరిణామాల వెనుక సీఎం నితీశ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో యువనేత చిరాగ్ సీఎం నితీశ్‌ను ముప్పుతిప్పలు పెట్టారు. ప్రతిరోజూ సీఎం నితీశే టార్గెట్‌గా విమర్శలు ఎక్కుపెట్టేవారు. అప్పుడు మిన్నకుండిపోయిన సీఎం నితీశ్… ఇప్పుడు చెలరేగిపోయి, ఏకంగా చిరాగ్ పార్టీని తుడిచిపెట్టడానికి సిద్ధమైపోయారు. మేనమామ పశుపతినాథ్‌ను బుజ్జగించడానికి చిరాగ్ పాశ్వాన్ చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. దాదాపు గంటపాటు మేనమామ పశుపతినాథ్ ఇంటిముందు చిరాగ్ నిలబడిపోయారు. అయినా మేనమామ కరుణించలేదు సరికదా… కనీసం కలవడానికి కూడా ఇష్టపడలేదు. దీంతో చేసేదేమీ లేక… చిరాగ్ వెనుదిరిగారు.
పార్లమెంటరీ పార్టీ నేతగా చిరాగ్ మేనమామ పశుపతినాథ్
పార్టీలో చీలిక రావడం, ఈ చీలిక నేతలకు పశుపతి నాథ్ నేతృత్వం వహిస్తున్న నేపథ్యంలో పార్లమెంట్‌లో ఎల్జేపీ నేతగా పశుపతి నాథ్ పారస్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఈయన హాజీపూర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. చిరాగ్‌పై ఈ ఐదుగురు ఎంపీలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, ఆయన నాయకత్వాన్ని ఏమాత్రం సహించడం లేదని పేర్కొన్నారు. పార్టీని కాపాడుకోవాలని తాము భావిస్తున్నానని, అందుకే ఇలా ఉన్నామని అన్నారు. అంతేగానీ చీల్చడానికి ప్రయత్నిస్తున్నామన్న వార్తలు పచ్చి అబద్ధాలని, తానే ఈ పార్టీని రక్షిస్తున్నానని పశుపతి నాథ్ వివరించారు.