అందరి దృష్టీ బెంగాల్ పైనే! సర్వశక్తులూ ఒడ్డుతున్న కాంగ్రెస్ నాయకులు
కోల్‌కతాః మే 2వ తేదీన శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత పశ్చిమ బెంగాల్లో ఎవరు అధికారం చేపడతారన్నది ఇప్పుడు ఆ రాష్ట్ర ప్రజలకే కాక, యావద్దేశానికి చర్చనీయాంశంగా మారింది. ఈ ఎన్నికల ఫలితాలు ఇతర పార్టీల మీద ఎలాంటి ప్రభావం చూపించబోతున్నప్పటికీ, వందేళ్లకు పైబడిన చరిత్ర కలిగిన కాంగ్రెస్ మీద మాత్రం తీవ్ర ప్రభావం చూపించబోతున్నాయి. పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలు కాంగ్రెస్‌కు చాలా కీలకమైనవి. సంస్థాగతంగా ఆ పార్టీ చరిత్రను, స్వరూప స్వభావాలను, తీరుతెన్నులను ఈ ఎన్నికలు ఒక మలుపు తిప్పబోతున్నాయన్నది రాజకీయ విశ్లేషకుల నిశ్చితాభిప్రాయం.
పశ్చిమ బెంగాల్‌తో పాటు కేరళ, అసోం రాష్ట్రాలకు కూడా ఎన్నికలు ప్రకటించిన నాటి నుంచి కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు పేట్రేగిపోయాయి. అసమ్మతి వర్గీయులు (గ్రూప్ 23గా పిలుస్తున్నారు) ఈ ఎన్నికలను సాకుగా తీసుకుని, సంస్థాగత మార్పులకు, ప్రక్షాళనకు పట్టుబట్టాలని గట్టి నిర్ణయంతో ఉన్నారు. తృణమూల్ కాంగ్రెస్ నుంచి పశ్చిమ బెంగాల్‌ను, వామపక్షాల నుంచి కేరళను, బీజేపీ నాయకత్వంలోని ఎన్.డి.ఎ నుంచి అసోంను ఈసారి తమ పార్టీ చేజిక్కించుకోలేకపోయిన పక్షంలో పార్టీ పరిస్థితి అధోగతి పాలు కావడం తప్పదని ఈ అసమ్మతి వర్గీయులు బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు.
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పనితీరు మెరుగుపడకపోతే పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్షుడుగా అశోక్ గెహ్లాత్, భూపేష్ బాఘేల్, కె.సి. వేణుగోపాల్, ముకుల్ వాస్నిక్‌లలో ఒకరిని నియమించే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. అది గనుక జరగని పక్షంలో ప్రియాంక గాంధీ అధ్యక్షురాలు అయ్యే అవకాశం కూడా ఉందని వారు వాదిస్తున్నారు.
అయితే, రాహుల్ గాంధీకి ప్రియాంక గాంధీ ప్రత్యామ్నాయమని కొందరు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాన్ని పార్టీకి అనుకూలమైన కొందరు విశ్లేషకులు కొట్టి పారేస్తున్నారు. కాంగ్రెస్ సంస్కృతి గురించి మౌలికమైన అవగాహన లేనివారే ఇటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తుంటారని వారంటున్నారు. ప్రియాంక గాంధీ రాజకీయాల్లోకి రావడం గానీ, కాంగ్రెస్‌లో కీలక పాత్ర పోషిస్తుండడం గానీ రాహుల్ వల్లే సాధ్యమైందని వారు గుర్తు చేస్తున్నారు. మే 2 తర్వాత పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ, రాహుల్, ప్రియాంకలు కలిసే పని చేస్తారని, కలిసే నిర్ణయాలు తీసుకుంటారని వారు చెబుతున్నారు. రాహుల్ ఆశీస్సులు లేనిదే ప్రియాంక రాజకీయాల్లో, కాంగ్రెస్‌లో ఎదిగే ప్రసక్తే లేదని వారు అభిప్రాయపడుతున్నారు.
కాంగ్రెస్‌పై తీవ్ర ప్రభావం
మే 2న ఫలితాలు వెలువడిన తర్వాత పార్టీలో ఎటువంటి మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయన్న విషయాన్ని పక్కనపెడితే, పశ్చిమ బెంగాల్, అసోం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు ఎన్నికల ప్రభావం కాంగ్రెస్ మీద తీవ్రంగా ఉండబోతోందన్నది మాత్రం వాస్తవం. ఒక్క కాంగ్రెస్ మీదే కాదు, దేశ రాజకీయాల మీద కూడా వీటి ప్రభావం ఉంటుందనడంలో సందేహం లేదు. బీజేపీ, నరేంద్ర మోదీల శక్తి సామర్థ్యాలతో పాటు, రాహుల్ గాంధీ ప్రతిభా పాటవాలు కూడా మరోసారి బయటపడతాయి.
అసోంలో బీజేపీ అధికారంలోకి వచ్చినా, పుదుచ్చేరిలో బీజేపీ భాగస్వామ్య పక్షం అధికారంలోకి వచ్చినా కాంగ్రెస్ నాయకత్వం అంతగా ఆందోళన చెందకపోవచ్చు గానీ, పశ్చిమ బెంగాల్లో పాగా వేస్తే మాత్రం ఆ పార్టీ పరిస్థితి అతలాకుతలం అయిపోతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆ పార్టీ నాయకత్వానికే కాక, ఆ పార్టీ నాయకులకు కూడా పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలు కీలకంగా మారాయి. నిజానికి, పశ్చిమ బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్‌కు, బీజేపీకి మధ్యే గట్టి పోటీ నెలకొని ఉంది. అక్కడ కాంగ్రెస్ పరిస్థితి చాలా బలహీనంగా ఉందనేది కాదనలేని సత్యం. అయినప్పటికీ ఇక్కడ తాము పరాజయం చెందడంతో పాటు, బీజేపీ అధికారంలోకి వచ్చే పక్షంలో కాంగ్రెస్ పరిస్థితి సైద్ధాంతికంగా అధోగతి పాలవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
బీజేపీతో అనేక భయాలు
ఈ రాష్ట్రంలో బీజేపీ కొద్దిపాటి మెజారిటీతో విజయం సాధించినా కాంగ్రెస్ నుంచి నిష్క్రమించడానికి పలువురు నాయకులు సిద్ధంగా ఉన్నారు. కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్ ప్రవచిస్తున్న లౌకికవాద సిద్ధాంతాలకు కాలం చెల్లిందనే అభిప్రాయం పార్టీలో పలువురు నాయకులకు కలిగే అవకాశం ఉంది. పార్టీ ఉనికి మీదే వారికి సందేహాలు తలెత్తే సూచనలున్నాయి. తాము ఎంతగా ప్రయత్నించినా మోదీ, అమిత్ షాల ద్వయాన్ని ఏమీ చేయలేమనే అభిప్రాయం కూడా కలుగుతుంది. ప్రాంతీయతత్వం, ఉప జాతీయవాదం వగైరాలతో మమతా బెనర్జీ ఎంతగా ప్రచారం చేసినా అవి ఓటర్ల ముందు పని చేయకపోగా, బీజేపీ ‘మతతత్వం, జాతీయవాదం’ ఓటర్లను ఆకట్టుకోవడం కాంగ్రెస్ అగ్రనాయకత్వాన్ని సైతం చతికిలబడేలా చేస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తాము అధికారంలోకి రాకపోయినా పరవాలేదు కానీ, బీజేపీ మాత్రం అధికారంలోకి రాకూడదని కాంగ్రెస్‌లో ఒక వర్గం నాయకులు భావిస్తున్నారు. మమతా బెనర్జీ మళ్లీ అధికారంలోకి వచ్చినా పరవాలేదని వారు చెబుతున్నారు. కేరళ, అసోంలలో తాము ఓడిపోయినా, పశ్చిమ బెంగాల్లో ఓడిపోతే వచ్చినన్ని విమర్శలు రావని ఆ నాయకులు అభిప్రాయపడుతున్నారు.
తమిళనాడులో కాంగ్రెస్ భాగస్వామ్య పక్షంగా ఉన్న డి.ఎం.కె కూటమి, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ విజయం సాధించగలిగితే తమకెంతో ఉపశమనం లభిస్తుందని కాంగ్రెస్ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. బీజేపీ విజయాలు సాధిస్తే మాత్రం పార్టీ సైద్ధాంతిక పునాదులు కూలిపోవడం కాకుండా, పార్టీలో ఆత్మవిశ్వాసం పూర్తిగా కుప్పకూలిపోతుందని ఎక్కువ మంది నాయకులు ఆందోళన చెందుతున్నారు. తృణమూల్ కాంగ్రెస్, డి.ఎం.కెలు విజయం సాధిస్తే, 2024 ఎన్నికల్లో ఆ పార్టీలతో పొత్తు కుదర్చుకోవచ్చని కూడా వారు అంచనా వేస్తున్నారు.
డాక్టర్ వడ్లమాని కనకదుర్గ













