Amit Shah: మార్చి 31 కల్లా నక్సలిజాన్ని అంతం చేస్తాం: అమిత్ షా
దేశంలో వామపక్ష తీవ్రవాదానికి (నక్సలిజం) చరమగీతం పాడే సమయం ఆసన్నమైందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) స్పష్టం చేశారు. ముందుగా నిర్ణయించినట్లుగానే, ఈ ఏడాది మార్చి 31 నాటికి దేశం నుండి నక్సలిజాన్ని పూర్తిగా తుడిచిపెట్టేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఛత్తీస్‌గఢ్ వెళ్లిన ఆయన, రాయ్‌పూర్‌లో భద్రతా దళాలు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు.
మావోయిస్టుల ఆర్థిక మూలాలను దెబ్బతీయడం, ప్రభావిత ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించడం, పటిష్టమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయడం వంటి తమ వ్యూహాలు అద్భుత ఫలితాలనిచ్చాయని షా (Amit Shah) పేర్కొన్నారు. నక్సల్స్ ఒక రాష్ట్రం నుండి మరో రాష్ట్రానికి పారిపోకుండా ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఒడిశా, మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల మధ్య పటిష్టమైన సమన్వయం ఉండాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణు డియో సాయి, కేంద్ర బలగాల (CRPF, BSF, ITBP) డైరెక్టర్ జనరల్స్ తదితర అధికారులు పాల్గొన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
అనంతరం జరిగిన ‘ఛత్తీస్‌గఢ్@25’ కార్యక్రమంలో అమిత్ షా మాట్లాడుతూ.. అభివృద్ధి లేకపోవడం వల్లే నక్సలిజం పుట్టిందన్న వాదనను తీవ్రంగా ఖండించారు. ఇది పేదరికం వల్ల వచ్చిన సమస్య కాదని, రాజ్యాంగాన్ని వ్యతిరేకించే వక్ర సిద్ధాంతాల వల్ల పుట్టిన హింసాత్మక ఉద్యమం అని అభివర్ణించారు. 1980లలో బస్తర్ కంటే వెనుకబడిన ప్రాంతాలు దేశంలో చాలా ఉన్నాయని, కానీ అక్కడ నక్సలిజం రాలేదని గుర్తుచేశారు. ఆయుధాలు వీడి లొంగిపోయే మావోయిస్టులకు ప్రభుత్వం ‘రెడ్ కార్పెట్’ (Red Carpet) వేసి సాదరంగా ఆహ్వానిస్తుందని, జనజీవన స్రవంతిలో కలవాలని ఆయన పిలుపునిచ్చారు.













