తెలివిగా ఓటు వేయండి : అసోం ప్రజలకు మన్మోహన్ పిలుపు
అసోం మొదటి దశ పోలింగ్ నేపథ్యంలో మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ ఓ వీడియోను విడుదల చేశారు. ఎన్నికల సందర్భంగా అసోం ప్రజలందరూ తెలివిగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగం మీద విశ్వాసం ఉంచే పార్టీలకు మాత్రమే ఓటు వేయాలని పిలుపునిచ్చారు. మీలో ఒకడిగా మాట్లాడుతున్నానని, ఆలోచించి, తెలివిగా ఓటు వేయాలని అభ్యర్థించారు. ‘‘రాజ్యాంగం మీద, ప్రజాస్వామ్య విలువల మీద నమ్మకముంచే ప్రభుత్వానికి ఓటు వేయండి. ప్రతి పౌరుడి జీవితానికి రక్షణ కల్పించే ప్రభుత్వాన్ని ఎన్నుకోండి. సమగ్రమైన అభివృద్ధి చేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోండి. అసోంను శాంతి మార్గంలో, అభివృద్ధి మార్గంలో నడిపించే ప్రభుత్వానికే ఓటు వేయండి. సోదర సోదరీమణులారా…. మీ భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తూ మీ చేతుల్లోనే ఉంది.’’ అంటూ మన్మోహన్ వీడియో ద్వారా పేర్కొన్నారు. ఐదేళ్ల పాటు ఆర్థిక మంత్రిగా, పదేళ్ల పాటు భారత ప్రధానిగా దేశానికి సేవ చేసే అదృష్టాన్ని అసోం ప్రజలు కల్పించారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం సమాజం కులం, మతం, ప్రాంతం, భాషా తదితర ప్రాతిపాదికలుగా విడిపోయిందని, చీలిపోయిందని పేర్కొన్నారు. మోదీ తీసుకొచ్చిన జీఎస్టీ వల్ల ఆర్థిక వ్యవస్థ బలహీనపడిందని, యువతకు ఉపాధి లభించడం లేదని, దీని ద్వారా వారి బతుకులు ఛిద్రమవుతున్నాయని మన్మోహన్ ఆవేదన వ్యక్తం చేశారు.













