తెలుగులో ధైర్యంగా మాట్లాడండి
తెలుగు భాషను చదవడం, రాయడం, మాట్లాడటం ప్రతీ ఒక్కరి అభిరుచి కావాలని, మాతృభాషలో మాట్లాడటాన్ని గర్వ కారణంగా భావించాలని, ఇప్పటికైనా సృజనాత్మక మార్గాల్లో తెలుగు భాష ఆధునీకరణ జరగాల్సిన అవసరం ఏర్పడిందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. భారతదేశంలోని అనేక ప్రాచీన భాషల్లో ఒక్కటైన తెలుగును పరిరక్షించుకుని, మరింత సుసంపన్నంగా తీర్చిదిద్దడమే గిడుగు రామ్మూర్తి పంతులుకు ఇచ్చే నిజమైన నివాళి అన్నారు. ఈ సందర్భంగా ఆయన తెలుగు భాష పరిరక్షణ కోసం 16 సూత్రాలను ప్రతిపాదించారు.
భారతీయ భాషలను మాట్లాడటంలో ఎలాంటి ఆత్మన్యూనతా భావం అవసరం లేదని అంటూ, తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని వర్చువల్గా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. భారతీయ భాషలకు వినూత్నమైన మార్గాల్లో విస్త•త ప్రచారం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. భాష అనేది స్థిరమైనది కాదని చెప్పారు. భాషను సుసంపన్నం చేసుకోవడానికి మార్పుకు అనుగుణమైన క్రియాశీల విధానాలను అవలంబించాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో సాంస్క•తిక, భాషా పునరుజ్జీవనానికి ప్రజలు మద్దతు ఇవ్వడంపై సంతోషం వ్యక్తం చేశారు.
గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి, తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా వర్చువల్ వేదికగా దక్షిణాఫ్రికా తెలుగు సంఘం, వీధి అరుగు నిర్వహించిన ‘తెలుగు భవిష్యత్తు – మన బాధ్యత’ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. తెలుగు భాషను కాపాడుకోవాలనే సత్సంకల్పంతో తెలుగు వారంతా ఒకే వేదిక మీదకు రావడం అభినందనీయమన్న ఆయన, ఈ కార్యక్రమ ఏర్పాటుకు ప్రోత్సాహాన్ని అందించిన ఉభయ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ చైర్మన్ సతీష్ రెడ్డి, తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, దక్షిణాఫ్రికా తెలుగు సంఘం సంస్థాపక అధ్యక్షుడు విక్రమ్ పెట్లూరి, వీధి అరుగు సంస్థాపక అధ్యక్షుడు వెంకట్ తరిగోపుల సహా వివిధ దేశాల భాషావేత్తలు, కవులు, కళాకారులు పాల్గొన్నారు.













