కాంగ్రెస్ సీనియర్ నేత మోతీలాల్ వోరా ఇకలేరు
మధ్యప్రదేశ్ మాజీ సీఎం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మోతీలాల్ వోరా(93) కన్నుమూశారు. కిడ్నీ సంబంధ సమస్యతో ఢిల్లీలోని ఎస్కార్ట్ ఆస్పత్రిలో చేరిన ఆయన ఈ రోజు తుది శ్వాస విడిచారు. ఈ మేరకు మీడియా వర్గాలు వెల్లడించాయి. కాగా వోరా ఆదివారమే తన 93వ జన్మిదిన వేడుకలు జరుపుకొన్నారు. అక్టోబర్‌లో కోవిడ్ బారిన పడిన వోరా.. ఎయిమ్స్‌లో చేరిన విషయం తెలిసిందే. 1927లో జన్మించిన మోతీలాల్ వోరా, యుక్తవయసు నుంచే చాలా కాలం జర్నలిజంలో సేవలందించారు. అనంతరం 1968లో రాజకీయాల్లో అడుగుపెట్టి, మధ్యప్రదేశ్ సీఎంగా, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర గవర్నర్‌గా, ఆలిండియా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా అనేక బాధ్యతలు నిర్వహించారు.
వోరా మృతి పట్ల కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ సంతాపం తెలియజేశారు. వోరా మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. ఆయన్ను కోల్పోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. వోరా కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. దశాబ్దాల రాజకీయ జీవితంలో విస్తారమైన పాలనా అనుభవం ఉన్న నాయకుడిని కోల్పోవడం బాధకరమని మోదీ అన్నారు. వోరా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు మోదీ.













