మే 18న తెరుచుకోనున్న బద్రీనాథ్ ఆలయం
ఉత్తరాఖండ్ రాష్ట్రం చమోలీ జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన బద్రీనాథ్ ఆలయ ద్వారాలు మే 18న తెరుచుకోనున్నాయి. వసంత పంచమి సందర్భంగా టెహ్రీ రాజ వంశస్థుల నివాసమైన నరేంద్రనగర్ ప్యాలెస్‌లో బద్రీనాథ్ ఆలయ పున:ప్రారంభానికి ముహూర్తం నిర్ణయించారు. అనంతరం మే 18న ఉదయం 4:15 గంటలకు ఆలయ ద్వారాలను తెరుస్తామని చార్ధామ్ దేవస్థానం బోర్డు అధికారులు వెల్లడించారు. కాగా బద్రీనాథ్ ఆలయాన్ని ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ప్రతి ఏడాది శీతాకాలంలో మూసివేస్తారు. అనంతరం వేసవిలో తిరిగి తెరుస్తారు. ఆలయ ప్రారంభానికి ముందు ఏప్రిల్ 29న నరేంద్రనగర్ ప్యాలెస్ నుంచి అఖండ జ్యోతి బద్రీనాథ్‌కు బయలుదేరుతుంది. మే 18న జ్యోతి ఆలయానికి చేరుకోగానే వేదపండితుల మంత్రోచ్చారణల నడుమ క్షేత్ర ద్వారాలు తెరుచుకుంటాయి.













