ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ రాజీనామా
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ తన పదవికి రాజీనామా చేశారు. సొంత పార్టీ నేతల నుంచే అసంతృప్తి ఎదురవడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ బేబీ రాణి మౌర్యను కలిసి తన రాజీనామా లేఖను సమర్పించారు. రావత్ నాయకత్వంపై రాష్ట్ర బీజేపీ నేతల్లో కొంతకాలంగా అసంతృప్తి నెలకొన్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఇదే విషయమై గత కొన్ని రోజులుగా కనీసం పదిమంది పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఢిల్లీలో మకాం వేసినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. దీంతో రంగంలోకి దిగిన బీజేపీ అధిష్ఠానం ఇటీవల ఇద్దరు సీనియర్ నేతలను రాష్ట్రానికి పంపింది. రాష్ట్ర కోర్ సభ్యులతో వారు సమావేశమయ్యారు. మరోవైపు రావత్ ఢిల్లీ వెళ్లి బీజేపీ అధిష్టానాన్ని కలిశారు. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలల్లో బీజేపీ విజయం సాధించడంతో త్రివేంద్ర సింగ్ రావత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.













