రైతులపోరుకు మద్దతు తెలిపిన సెనెట్ సభ్యులు… భారత్ అభ్యంతరం
నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులకు విదేశాల నుంచి కూడా మద్దతు లభిస్తోంది. అమెరికాకు చెందిన పలువురు శాసనకర్తలు రైతుల నిరసనకు సంఘీభావం ప్రకటించారు. ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న పంజాబ్ రైతులకు నేను సంఘీభావం తెలుపుతున్నాను అని కాంగ్రెస్ సభ్యుడు డగ్ లామాల్ఫా అన్నారు. అలాగే కాలిఫోర్నియాకు చెందిన రిపబ్లికన్ ప్రజాప్రతినిధి మాట్లాడుతూ పంజాబ్ రైతులు ఎటువంటి భయాందోళన లేకుండా, శాంతియుతంగా నిరసన తెలిపేందుకు ప్రభుత్వం అనుమతించాలి అని పేర్కొన్నారు. డెమొక్రాటిక్ కాంగ్రెస్ సభ్యుడు జోష్ ఆర్డర్ స్పందిస్తూ భారత్ ఒక అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. శాంతియుత నిరసన ఆ దేశ ప్రజల హక్కు. రైతులతో మోదీ సహా ప్రభుత్వ ప్రతినిధులు ఫలవంతమైన చర్చలు జరపాలని కోరుతున్నాను అని వ్యాఖ్యానించారు.
పలువురు నాయకులతో పాటు అమెరికాలో పలు మీడియా సంస్థలు రైతుల ఆందోళనలపై కథనాలు ప్రచురించాయి. ఇలా రైతుల ఆందోళనలపై విదేశీ నేతల సంఘీభావం తెలపడంపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఒక ప్రజాస్వామ్య దేశంలోని అంతర్గత వ్యవహారాలపై విదేశీ నేతల జోక్యం అవసరం లేదని భారత్ సృష్టం చేసింది. ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనపై పలు ఇతర దేశాల నాయకులు చేసిన వ్యాఖ్యల్ని విదేశాంగశాఖ తీవ్రంగా ఖండించింది. అవన్నీ తప్పుడు సమాచారంతో, దురుద్దేశపూర్వకంగా చేయిస్తున్న వ్యాఖ్యలని పేర్కొంది.













