హ్యుమానిటీస్ లో మెరిసిన రైతు బిడ్డ
ఉత్తర్‌ప్రదేశ్‌లో మారుమూల గ్రామంలోని పేద రైతు కుమారుడు సీబీఎస్ఈ 12వ తరగతిలో 98.2 శాతం మార్కులతో మెరిశాడు. అమెరికా లోని ప్రతిష్ఠాత్మక కార్నెల్ యూనివర్సిటీలో అర్థశాస్త్రంలో ఉన్నతవిద్యను పూర్తి ఉపకార వేతనంతో చదివే అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. లఖీంపూర్ జిల్లా సరసన్ గ్రామానికి చెందిన కమల్పతి, సంగీత దంపతుల కుమారుడు అనురాగ్ తివారీ(18) మంగళవారం వెలువడిన సీబీఎస్ఈ బోర్డు 12వ తరగతి ఫలితాల్లో హ్యుమానిటీస్‌లో గరిష్ట మార్కులు సాధించాడు. మ్యాథ్స్‌లో 95, ఇంగ్లిష్‌లో 97, పొలిటికల్ సైన్స్‌లో 99, హిస్టరీ, ఎకనామిక్స్‌లలో 100కు 100 మార్కులు సాధించాడు.
గత ఏడాది డిసెంబరులో జరిగిన శాట్ పరీక్షలోనూ 1370 మార్కులు వచ్చాయి. అప్పుడే అమెరికాలోని కార్నెల్ వర్సిటీలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకుని ఉపకార వేతనంతో సీటు ఖరారు చేసుకున్నాడు. ఇప్పుడు బోర్డు ఫలితాల్లోను అత్యుత్తమ మార్కులు రావడంతో అమెరికాలో చదువులకు మార్గం సుగమమైంది. అయితే ఇదంతా సులభంగా జరగలేదని అనురాగ్ చెప్పారు. నాతో పాటు ముగ్గురు అక్కలను పోషించేందుకు మా తల్లిదండ్రులు ఎంతో కష్టపడేవారు. చదివించే స్థోమత లేక ఐదో తరగతి తర్వాతే నన్ను మానేయమన్నారు. వ్యవసాయ పనులు చేస్తూ ఇంటివద్దే ఉండాలని చెప్పారు. అక్కలు సర్దిచెప్పడంతో అయిష్టంగానే పాఠశాలకు పంపారు అని చెప్పారు.













