ప్రయాణాలను అడ్డుకోకండి: రాష్ట్రాలకు కేంద్రం సూచన
అన్లాక్ 3 లో భాగంగా లాక్ డౌన్ నిబంధనలను కేంద్ర ప్రభుత్వం చాలా వరకూ సడలించింది. అదే క్రమంలో గత నెల 31కి ముందు విధించిన నిబంధనల్లో మరింత వెసులుబాటు కల్పిస్తూ తాజాగా కేంద్రం మరో ప్రకటన చేసింది. అంతర్రాష్ట్ర ప్రయాణాలపై ఎలాంటి ఆంక్షలను విధించొద్దని రాష్ట్రాలను, యూటీలను కేంద్రం కోరింది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా ఈరోజు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖలు రాశారు. ఆంక్షల పరిధిలోకి అంతర్రాష్ట్ర ప్రయాణాలను, సరుకుల రవాణాను తీసుకురావద్దని లేఖలో కోరారు. అంతర్రాష్ట్ర ప్రయాణాలు, సరుకు రవాణాలపై ఆంక్షలు ఉండటం వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. ప్రయాణాలపై జిల్లా స్థాయి అధికారులు ఆంక్షలు విధిస్తున్నట్టు తమకు సమాచారం అందుతోందని ఇది దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
నిజానికి గత నెలలోనే అంతర్రాష్ట్ర ప్రయాణాలపై కేంద్రం ఆంక్షలు ఎత్తివేసింది. రాష్ట్రాల మధ్య యధేఛ్చగా రాకపోకలు సాగించవచ్చునని తెలిపింది. అయితే ఈ విషయంలో తమ తమ రాష్ట్రాలలో పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకునే స్వేఛ్చ రాష్ట్రాలకు ఇచ్చింది. దీంతో పలు రాష్ట్రాలు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారికి నిబంధనాలతో అడ్డుకుంటున్నాయి. ఇది రాష్ట్రాల మధ్య ప్రయాణాలకు మాత్రమే కాకుండా రైల్వే సహా ఇతర రంగాల మీద పెను ప్రభావం చూపుతూ ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టే చర్యలకు విఘాతం కలిగిస్తుండడంతో కేంద్రం తాజా ప్రకటన చేసినట్టు కనిపిస్తోంది. ఈ నేపధ్యంలో అన్లాక్ 4లో దీనిపై మరింత స్పష్టమైన ఆదేశాలు రావచ్చునని తెలుస్తోంది.













