‘నేను మరణించానా? లేదా? అని ధ్రువీకరణ చేసుకోకుండానే ప్రసారం చేస్తారా? సుమిత్ర మహాజన్
లోక్‌సభ మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్ చనిపోయారన్న వార్తలు రావడంతో దేశంలో ఒక్కసారిగా కలకలం రేగింది. ముంబైలోని కొన్ని ఛానెళ్లు ఫ్లాష్… ఫ్లాష్… అంటూ ప్రసారం చేశాయి. అంతేకాకుండా కాంగ్రెస్ ఎంపీ, సీనియర్ నేత శశిథరూర్ ఆమె మరణంపై ట్వీట్ చేశారు. ఆమెకు సంతాపం ప్రకటిస్తూ ట్వీట్ చేశారు. అయితే ఆమె పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని బీజేపీ నేతలు చెప్పడంతో ఆయన ఆ ట్వీట్‌ను డిలీట్ చేశారు. ఆ ఛానెళ్లు కూడా ఆమె చనిపోలేదని తిరిగి ప్రసారం చేశాయి. దీంతో మరింత గందరగోళం నెలకొంది. అయితే ఆమె పూర్తి ఆరోగ్యంగానే ఉన్నారంటూ బీజేపీ నేతలు స్పందించారు. దీంతో పరిస్థితి సద్దుమణిగింది.
విశ్వసనీయ సమాచారం అందింది.. అందుకే… : థరూర్
మాజీ స్పీకర్ సుమిత్రా మహజన్‌కు సంతాపం ప్రకటిస్తూ చేసిన ట్వీట్‌పై శశి థరూర్ స్పందించారు. అత్యంత నమ్మకమైన చోటు నుంచి తనకు సమాచారం అందిందని, అది నిజమే అనుకొని అలా ట్వీట్ చేశానని వివరణ ఇచ్చారు. ఆమె పూర్తి ఆరోగ్యంగా ఉన్నారంటే అంతకు మించిన ఉపశమనం తనకు లేదన్నారు. గత రాత్రి సుమిత్రా మహాజన్ కుమారుడితో మాట్లాడానని, తప్పుడు ప్రచారంపై క్షమాపణలు కూడా కోరానని వెల్లడించారు. ‘‘వారందరూ దయతో అర్థం చేసుకున్నారు. ఆమె పూర్తి ఆరోగ్యంగా ఉన్నారనగానే సంతోషం కలిగింది. కుటుంబీకులందరికీ శుభాకాంక్షలు తెలిపాను’’ అని థరూర్ పేర్కొన్నారు.
ధ్రువీకరణ లేకుండానే ప్రకటిస్తారా? సుమిత్రా ఫైర్
తాను చనిపోయినట్లు వచ్చిన తప్పుడు వార్తలపై సుమిత్రా మహాజన్ స్పందించారు. ‘‘తాను మరణించానో, లేదో అని ధ్రువీకరించుకోకుండానే ప్రకటిస్తారా? అంత తొందరేమిటి?’’ అంటూ మీడియాపై మండిపడ్డారు. ఇలా వార్తలు చెప్పే ముందు కనీసం ఇండోర్ జిల్లా అధికారులనైనా కనుక్కొని ఉండాల్సిందన్నారు. ఈ వార్త దేశమంతా వ్యాపించిందని, ముంబైలోని తన బంధువులు కూడా ఫోన్లు చేయడం మొదలు పెట్టారని ఆమె పేర్కొన్నారు. ఈ తప్పుడు వార్త ఎవరు పెట్టారంటూ ట్విట్టర్లో శశి థరూర్‌ని తన తమ్ముడు కూతురు కూడా నిలదీసిందని సుమిత్రా వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం, లోకసభ స్పీకర్ ఈ వ్యవహారాన్ని పరిశీలించాలని సుమిత్రా మహజన్ కోరారు.













