నితిన్ గడ్కరీ మరోసారి సంచలన వ్యాఖ్యలు.. నిరూపిస్తే రాజకీయాల నుంచి
ఎవరైనా తాను ఒక్క రూపాయి కమీషన్ తీసుకున్నట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి వైదొలుగుతానని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముంబయిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇతరుల నుంచి కమీషన్ తీసుకోవాల్సిన అవసరం తనకు లేదని, యూట్యూబ్ ఛానెల్ నుంచే నెలకూ రూ. 3 లక్షల ఆదాయం వస్తుందని తెలిపారు. రాజకీయాలంటే డబ్బులు సంపాదించే వ్యాపారం కాదు. నాకు ఎవరి నుంచి కమీషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నేను హిందీ, మరాఠీ ఇంగ్లీష్‌లో చేసిన ప్రసంగాలు యూట్యూబ్‌లో చాలా మంది చూస్తారు. అమెరికాలో ఎక్కువ మంది నా ప్రసంగాలను చూస్తారు. నా యూట్యూబ్ ఛానెల్ నుంచే నెలకు రూ. 3 లక్షల ఆదాయం లభిస్తుంది అని అన్నారు. చిన్నతనంలో పనిచేసేందుకు సుముఖత చూపేవాడిని కాదని, అప్పుడే ఒకరి కింద పనిచేయకుండా నలుగురికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. నేను రాజకీయ నాయకుణ్ని. నాకు అన్ని వర్గాల వారి ఓట్లు కావాలి. అందుకే నేను కులం గురించి మాట్లాడను. అన్ని కులాల వారు నా కుటుంబ సభ్యులే, నా సోదరసమానులే అని అన్నారు.













