అలాంటి ప్రతిపాదన లేదు..అందుకే వాటిని : కేంద్రం స్పష్టత
కేంద్రీయ విద్యాలయాల ప్రవేశాల్లో ఎంపీ కోటా సహా పలు కోటాలను కేంద్రం గతేడాది రద్దు చేసిన విషయం తెలిసిందే. ఇందులో ఎంపీ కోటాను పునరుద్ధరించే అవకాశాలున్నట్లు ఊహాగానాలు వినిపించాయి. అయితే వీటిని కేంద్రం కొట్టిపారేసింది. అలాంటి ప్రతిపాదనేదీ లేదని కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి అన్నపూర్ణ దేవి రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో స్పష్టం చేశారు. రక్షణ, పారా మిలిటరీ, కేంద్ర స్వయంప్రతిపత్తి సంస్థలు, పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్, సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ వంటి కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో పనిచేసే సిబ్బంది తరచూ బదిలీలపై వెళ్తుంటారు. కాబట్టి వారి పిల్లల చదువుకు ఆటంకం కలగకుండా దేశవ్యాప్తంగా ఒకే విధమైన విద్యను నేర్చుకునేందుకు వీలుగా కేవీలను ప్రారంభించారు అని కేంద్ర మంత్రి తెలిపారు.
కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు ఎంపీ సహా ఇతర కోటాలను అనుమతిస్తే తరగతి గదుల్లో విద్యార్థుల సంఖ్య పెరిగిపోతోంది. ఇది బోధనపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. అందుకే వాటిని రద్దు చేశాం. పార్లమెంట్ సభ్యుల కోటాను మళ్లీ అందుబాటులోకి తీసుకొచ్చే ప్రతిపాదనేదీ ప్రస్తుతానికి కేంద్రం వద్ద లేదు అని మంత్రి తన సమాధానంలో స్పష్టం చేశారు.













