పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన!
పుదుచ్చేరిలో ఏర్పడ్డ రాజకీయ సంక్షోభం నేపథ్యంలో అక్కడ రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. బలపరీక్షలో విఫలమైన నారాయణ స్వామి రాజీనామా ఆమోదం అనంతరం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రతిపక్ష కూటమి ముందుకు రాకపోవడంతో కేంద్ర కేబినెట్ రాష్ట్రపతి పాలనకు నిర్ణయం తీసుకుంది. పుదుచ్చేరిలో అధికార పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శాసనసభలో కాంగ్రెస్‌కు బలం తగ్గింది. దీంతో అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నిర్వహించగా, నారాయణస్వామి ప్రభుత్వం అందులో నెగ్గలేకపోయింది. ఓటింగ్‌కు ముందుగానే సీఎం, మంత్రులు వాకౌట్ చేయడంతో విశ్వాస పరీక్షలో అధికార పార్టీ విఫలమైనట్లు స్పీకర్ ప్రకటించారు.
ఆ తర్వాత ముఖ్యమంత్రి నారాయణస్వామి, కేబినెట్ మంత్రులు లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు రాజీనామాలు అందించారు. అనంతరం పుదుచేర్చిలో రాష్ట్రపతి పాలన విధించాలని లెఫ్టినెంట్ గవర్నర్ సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. ఎల్జీ సిఫారసు మేరకు తాజాగా కేంద్ర కేబినెట్ పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలనపై నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే పుదుచ్చేరిలో త్వరలోనే జరుగనున్న శాసనసభ ఎన్నికల్లో గెలుపు కోసం పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేయనున్నాయి. ఎన్నికల ముందే ప్రభుత్వాన్ని కోల్పోయిన కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి రావాలని ప్రయత్నాలు చేస్తుండగా, బీజేపీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే విశ్వాసంతో ముందుకెళుతోంది.













