నువ్వూ రాజీనామా చెయ్.. మహా సీఎంకు ఉద్ధవ్ డిమాండ్
మహారాష్ట్ర రాజకీయ సంక్షోభానికి సంబంధించిన కేసులో సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో గవర్నర్ ప్రవర్తన సమర్ధనీయం కాదన్న అత్యున్నత న్యాయస్థానం.. బలపరీక్ష ఎదుర్కోకుండానే ఉద్ధవ్ థాకరే రాజీనామా చేయడంతో ఆయన ప్రభుత్వాన్ని పునరుద్ధరిచండం కుదరదని కూడా తేల్చిచెప్పింది. దీనిపై ఉద్దవ్ తాజాగా స్పందించారు. తాను నైతికతతో రాజీనామా చేశానని చెప్పిన ఉద్ధవ్.. ఆ సమయంలో గవర్నర్ నిర్ణయం కూడా తప్పు అని సుప్రీం కోర్టు తెలిపిన నేపథ్యంలో సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఇప్పుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
తాను ఎలాగైతే నైతిక బాధ్యత తీసుకొని రాజీనామా చేశాడో.. నేడు షిండే కూడా అలాగే చేయాలని ఉద్ధవ్ అన్నారు. షిండే వర్గం పార్టీకి, తన తండ్రికి వెన్నుపోటు పొడిచిందని మండిపడ్డారు. చట్టపరంగా తన రాజీనామా తప్పు కావొచ్చని, కానీ నైతికంగా తాను చేసింది కరెక్టే అని చెప్పారు. ఈ సుప్రీం కోర్టు తీర్పుపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ స్పందించేందుకు నిరాకరించారు. నాటి మహారాష్ట్ర గవర్నర్ నిర్ణయంపై సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలపై తానేమీ మాట్లాడబోనని సీఎం ఏక్నాథ్ షిండే కూడా మాటదాటేశారు. అప్పటి పరిస్థితులకు అనుగుణంగానే గవర్నర్ వ్యవహరించారని, తాను అది మాత్రం చెప్పగలనని చెప్పారు. ఒకవేళ ఫ్లోర్ టెస్ట్ జరిగి ఉంటే, అందులో తమ ప్రభుత్వం ఫెయిలైతే ఏమై ఉండేదని ప్రశ్నించారు.













