తలబిరుసు తనంగా వ్యవహరిస్తున్న ట్విట్టర్.. జమ్మూ, లద్దాఖ్లను వేరే దేశాలుగా గుర్తింపు

ట్విట్టర్ మరీ బరితెగించి ప్రవర్తిస్తోంది.మొన్నటికి మొన్న సాక్షాత్తూ కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ట్విట్టర్ ఖాతాను కొద్దిసేపు ఆపేసింది. ఆ తర్వాత పునరుద్ధరించింది. అంత కంటే ముందే కొందరు ప్రముఖుల బ్లూటిక్స్‌ను తొలగించి ధిక్కార చర్యలకు దిగిన విషయం తెలిసిందే. తాజాగా… ఏకంగా భారత భూభాగాలనే తప్పుగా చూపిస్తూ బరితెగింపులకు పూనుకుంది. కేంద్ర పాలిత ప్రాంతాలైన జమ్మూ కశ్మీర్, లద్దాఖ్‌ను ఏకంగా వేరే దేశంగా తన సైట్‌లో చూపించింది. అలాగే జమ్మూకశ్మీర్‌ను పాక్‌లో అంతర్భాగంగా చూపించడంతో నెటిజన్లు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. గతంలో కూడా ట్విట్టర్ ఇదే తలబిరుసుగా ప్రవర్తింంచింది. లేహ్ ప్రాంతాన్ని చైనాలో భూభాగంగా చూపించింది. దీంతో భారత ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై కేంద్రం వివరణలు కోరడంతో, క్షమాపణలు చెప్పింది. దీనిని మరిచిపోకుండానే ఈసారి కూడా మరో తప్పు చేసింది. మరోవైపు నూతన నిబంధనలను పాటించాలని కేంద్రం తెగేసి చెప్పింది. దీంతో కొన్ని రోజులుగా ట్విట్టర్‌కు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య వార్ నడుస్తోంది. నూతన నిబంధనల ప్రకారం ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేకంగా అధికారులను నియమించాలని కేంద్రం పలుమార్లు సూచించినా, ట్విట్టర్ పట్టించుకోలేదు.