వ్యవసాయం అంటేనే తెలియని వారు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారు : రాజ్‌నాథ్
1991 లో మాజీ ప్రధాని పీవీ తెచ్చిన సంస్కరణ ఫలితాలు కానీ, మరో మాజీ ప్రధాని వాజ్పాయ్ కాలంలో తీసుకొచ్చిన సంస్కరణ ఫలితాలు గానీ.. ఫలాలుగా మారడానికి ఐదేళ్ల కాలం పట్టిందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాల ఫలితాల కోసం ఐదేళ్లూ వేచి చూడాల్సిన అవసరం లేదని, కనీసం రెండేళ్ల పాటు వేచి చూడాలని ఆయన అభ్యర్థించారు. హిమాచల్ ప్రదేశ్‌లో బీజేపీ సారథ్యంలోని ప్రభుత్వం మూడేళ్ల పాలనను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వర్చువల్ ప్రసంగం చేశారు. కనీస మద్దతు ధర కచ్చితంగా ఉండి తీరుతుందని, ఈ విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందీ కలిగించమని స్పష్టం చేశారు.
నూతన చట్టాల ప్రతిఫలాలు అందాలంటే కాస్త సమయం వేచిచూద్దామని కోరారు. ‘‘మరో ఒకటి రెండేళ్ల వరకూ వేచి చూడండి. ఒకవేళ తేడాలు లేకుండా చర్చల ద్వారా వాటికి పరిష్కారం కనుగొందాం. 1991 లో పీవీ నరసింహారావు సంస్కరణలు తెచ్చారు. ఆ తర్వాత వాజ్పాయ్ తెచ్చారు. వీటి ఫలాలు అందాలంటే ఐదేళ్ల కాలం పట్టింది. నూతన చట్టాల విషయంలో ఐదేళ్లూ వేచి చూడాల్సిన పనిలేదు. కనీసం రెండేళ్లు వేచిచూద్దాం.’’ అని రాజ్‌నాథ్ సూచించారు. వ్యవసాయం అంటే ఏమిటో తెలియని వారు కూడా నేడు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు.
ప్రస్తుతానికి కానీ, తర్వాతి రోజుల్లో కానీ కనీస మద్దతు ధర అలాగే కొనసాగుతుందని, దీంతో పాటు మండీలు కూడా అలాగే కొనసాగుతాయని ఆయన పునరుద్ఘాటించారు. నూతనంగా తీసుకొచ్చిన చట్టాల ద్వారా రైతుల ఆదాయం కచ్చితంగా రెట్టింపు అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో హిమాచల్‌ప్రదేశ్‌కు కేవలం 22,000 కోట్ల రూపాయలను విడుదల చేసిందని, కానీ మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి మూడింతల నిధులను విడుదల చేసిందని ఆయన పేర్కొన్నారు. నూతన చట్టాల అమలు ద్వారా రైతుల భూమిని ఎవరూ లాక్కోరని, ఇందులో ఎలాంటి సంశయం కూడదని స్పష్టం చేశారు. రైతుల భూమిని కార్పొరేట్లు లాక్కొంటారని కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని వాటిని నమ్మవద్దని రాజ్‌నాథ్ ప్రజలను కోరారు.













