తృణమూల్ ఎంపీ మహువాపై లోక్సభ బహిష్కరణ వేటు.. విపక్షాల నిరసన
పార్లమెంటులో ప్రశ్నలు లేవనెత్తడానికి డబ్బులు అందుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాపై బహిష్కరణ వేటు పడింది. ఈ విషయంలో నివేదికను అందించిన పార్లమెంటు ఎథిక్స్ కమిటీ చైర్మన్.. మొయిత్రాపై బహిష్కరణ వేటు వేయాలని కోరారు. శుక్రవారం నాడు లోక్ సభలో ఈ నివేదికను ప్రవేశపెట్టారు. మొయిత్రా తీరు అనైతికం అని, ఆమె లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కమిటీ సిఫారసు చేసింది. ఈ నివేదికను మూజువాణి ఓటు ప్రాతిపదికన ఆమోదించిన లోక్ సభ.. మొయిత్రా సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీనిపై విపక్షాలు నిరసనలు తెలిపారు. కొత్త పార్లమెంటు భవనంలో ఇది బ్లాక్ డే, ఓ నల్ల అధ్యాయం మొదలైంది అంటూ కాంగ్రెస్ లోక్ సభాపక్ష నేత అధీర్ రంజన్ చౌదరి విమర్శించారు. మొయిత్రాను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించగానే, విపక్ష సభ్యులు లోక్ సభ నుంచి వాకౌట్ చేయడం గమనార్హం.













