5జీ సేవలు.. ఈ ఏడాదే!
5జీ స్పెక్ట్రం వేలంపై ఈ ఏడాది మార్చి నాటికి టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ నివేదిక సమర్పించవచ్చని భావిస్తున్నట్లు కేంద్ర టెలికం శాఖ మంత్రి అశ్విని వైష్టవ్ తెలిపారు. ట్రాయ్ సిఫార్సులు అందిన వెంటనే వేలం నిర్వహించడం ద్వారా సత్వరం 5జీ సేవలను అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. వీలైనంత త్వరగా స్పెక్ట్రం వేలాన్ని నిర్వహించేందుకు తత్సంబంధ ప్రక్రియలపై టెలికం శాఖ ఇప్పటికే కసరత్తు చేస్తోందని ఆయన వివరించారు. దేశీ టెక్నాలజీపై పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలకు ప్రోత్సాహమిచ్చేలా బడ్జెట్ ప్రతిపాదనలు ఉన్నాయని మంత్రి అభిప్రాయపడ్డారు. 2022`23లో 5జీ మొబైల్ సేవలు అందించేందుకు వీలుగా ఈ ఏడాది స్పెక్ట్రం వేలం నిర్వహించనున్నట్టు బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.













