దీదీకి మరో షాక్…. రాజ్యసభకు రాజీనామా చేసిన ఎంపీ
అధికార తృణమూల్ కాంగ్రెస్‌కు దెబ్బమీద దెబ్బ తగులుతూనే ఉంది. తాజాగా మరో ఎంపీ రాజీనామా చేశారు. దినేశ్ త్రివేదీ తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజీనామాను చైర్మన్ వెంకయ్య నాయుడుకు అందజేశారు. అయితే ఈ హఠాత్పరిణామంతో తృణమూల్ కాంగ్రెస్ ఖంగుతింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… బెంగాల్లో అంత హింస జరుగుతున్నా నిస్సహాయునిగా ఉండిపోతున్నానని, ఆ హింసతో ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా రాజ్యసభలో కూర్చోవడం వింతగా అనిపిస్తోందని, ఏం చేయాలో ఆలోచిస్తున్నానని పేర్కొన్నారు. ఇక్కడ కూర్చోని తానేమీ మాట్లాడలేకపోతున్నానని, ఇక్కడ ఉన్నందుకు లాభం లేదని, అందుకే రాజీనామా చేస్తున్నట్లు ఆయన సంచలన ప్రకటన చేశారు. ‘‘పార్టీ ఆదేశాల అనుగుణంగానే నడుచుకోవాలనుకుంటున్నా. కానీ నా గొంతును నొక్కేస్తున్నారు. నేనేమీ చేయలేకపోతున్నా. రాజ్యసభకు పంపినందుకు పార్టీకి ధన్యవాదాలు. రాష్ట్రానికి వెళ్లి సేవ చేయాలని భావిస్తున్నా.’’ అని దినేశ్ త్రివేదీ ప్రకటించారు. అంతరాత్మ ప్రబోధం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నానని ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడు గుండె బరువు బాగా తగ్గిందని, ఏమీ మాట్లాడకుండా సభలో కూర్చోలేనని, అందుకే రాజీనామా చేసినట్లు ఆయన పేర్కొన్నారు. నేతలందరూ స్వామి వివేకానంద, ఠాగోర్, చంద్రబోస్ లాంటి పేర్లను మాత్రమే ఉచ్చరిస్తారని, వారి ఆలోచన ధారను ఏమాత్రం ఫాలో కారని పరోక్షంగా మమతపై విరుచుకుపడ్డారు. అధినేత్రి మమతా బెనర్జీ ముందు మాట్లాడే పరిస్థితి ప్రస్తుతానికి లేదని, భావాలను వ్యక్తీకరించే స్థానం కూడా లేదన్నారు. ప్రతి సారీ ప్రధానిని విమర్శించాల్సిన అవసరం లేదని, చెప్పదలుచుకున్న విషయాన్ని చాలా గౌరవ ప్రదంగా కూడా చెప్పే అవకాశం ఉంటుందని చురకలంటించారు. సుదీర్ఘంగా ఆలోచించి, ఓ నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ప్రతి మనిషికీ వస్తుందని, తాను మాట్లాడుతున్న మాటలు కొత్తగా మాట్లాడుతున్న మాటలు ఎంత మాత్రం కావన్నారు. బెంగాల్లో హింస, అవినీతి విపరీతంగా పెరిగిపోయిందని, వాటికి వ్యతిరేకంగా చాలా సార్లు గళం విప్పానని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుతానికి నేను స్వంతంత్రుడ్ని ….
బీజేపీలో చేరిపోతారా? అన్న ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ… ప్రస్తుతానికి నేను స్వతంత్రుణ్ని అని సమాధానమిచ్చారు. తృణమూల్ ప్రస్తుతం కార్పొరేట్ చేతుల్లోకి వెళ్లిపోయిందని, వారే పార్టీని నడిపిస్తున్నారని పరోక్షంగా ప్రశాంత్ కిశోర్‌పై విరుచుకుపడ్డారు. రాజకీయాల్లో ఏబీసీలు తెలియని వారు కూడా నేతలుగా చెలామణి అయిపోతున్నారి, ఈ స్థితిలో ఏమీ చేయలేమని పేర్కొన్నారు. ఈ విషయంపై పార్టీలో ఎవరిని అడిగినా ఇదే విషయం చెబుతారని, దీర్ఘంగా ఆలోచించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నానని త్రివేదీ వెల్లడించారు.
షాక్‌కు గురి చేసింది : తృణమూల్ ఎంపీ సౌగతా రాయ్
రాజ్యసభ సభ్యుడు దినేష్ త్రివేదీ రాజీనామాపై అధికార తృణమూల్ స్పందించింది. ఆ పార్టీ ఎంపీ సౌగతా రాయ్ మాట్లాడుతూ… ఆయన రాజీనామా చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఆయన రాజీనామా చేయడం ఏమీ బాగోలేదని, ఆయన అసంతృప్తితో ఉన్నారన్న విషయం తెలుసు కానీ, ఇంత హఠాత్తుగా రాజీనామా నిర్ణయం తీసుకుంటారని ఊహించలేదన్నారు. ఆయనకు ఏవైనా ఇబ్బందులు ఉంటే కచ్చితంగా పార్టీలో చర్చించి ఉండేవారని సౌగతా రాయ్ పేర్కొన్నారు. ఆయన చాలా సీనియర్ నేత అని, కింది స్థాయి వరకూ ఆయనకు సత్సంబంధాలే ఉన్నాయని, అందుకే ఆయన్ను అధినేత్రి మమత రాజ్యసభకు పంపినట్లు సౌగతా రాయ్ పేర్కొన్నారు.
బీజేపీలోకి వస్తే స్వాగతిస్తాం : కైలాస్ విజయ వర్గీయ
దినేష్ త్రివేదీ బీజేపీలోకి వస్తే కచ్చితంగా స్వాగతిస్తామని బెంగాల్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి కైలాస్ విజయ వర్గీయ ప్రకటించారు. త్రివేదీయే కాదని, తృణమూల్‌లో ఎవరు స్వతంత్రంగా, నిజాయితీతో పనిచేసినా, వారందరికీ ఇదే బహుమానం దక్కుతుందని ఎద్దేవా చేశారు. అలా బతకాలనుకునేవారు తృణమూల్‌లో ఉండలేరన్నారు. ఒకవేళ త్రివేదీ బీజేపీలోకి రావాలని భావిస్తే మాత్రం సాదరంగా ఆయనకు స్వాగతం పలుకుతామని వర్గీయ ప్రకటించారు.
సైలెంట్‌గా రాజకీయాలు నెరిపే నేతగా గుర్తింపు
దినేశ్ త్రివేదీ… కింది స్థాయి వరకూ నేతలు, కార్యకర్తలతో సత్సంబంధాలు కలిగి ఉన్న నేత. సైలెంట్‌గా ఉంటూనే రాజకీయాలు తనచుట్టూ తిప్పుకుంటారని పేరుంది. యూపీఏ -2 హయాంలో రైల్వే మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. మమత బెనర్జీకి అత్యంత సన్నిహితులుగా పేరు గడించారు. గతంలో మమత బెనర్జీ రైల్వే మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించేవారు. ఆ తర్వాత ఆమె బెంగాల్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. దీంతో దినేశ్ త్రివేదీకి రైల్వే శాఖ బాధ్యతలు అప్పజెప్పారు. అయితే రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టి… రైల్వే ఛార్జీలను గణనీయంగా పెంచేశారు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మమత… 24 గంటల్లోనే రాజీనామా చేయాలని కోరారు. అంతేకాకుండా ముకుల్ రాయ్‌ను రైల్వే మంత్రిగా నియమించారు. అయితే దినేశ్ ససేమిరా అంగీకరించలేదు. ఎందుకు రాజీనామా చేయాలో చెప్పాలని నిలదీశారు. దీంతో మమతా బెనర్జీ నేరుగా అప్పటి ప్రధాని మన్మోహన్‌కు లేఖ రాశారు. త్రివేదీని వెంటనే పదవి నుంచి తొలగించి, ముకుల్ రాయ్‌ను నియమించాలని కోరారు. దినేశ్ త్రివేదీ మొదట కాంగ్రెస్‌లో ఉండేవారు. ఆ తర్వాత జనతాదళ్‌లో చేరిపోయారు. ఆ తర్వాత టీఎంసీలో చేరి కీలక నేతగా ఎదిగిపోయారు. మమతా బెనర్జీ తృణమూల్‌ను స్థాపించినప్పటి నుంచీ ఆయన పార్టీలో కొనసాగుతున్నారు.













