టైమ్ మ్యాగజైన్ పై మహిళా రైతులు
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రముఖ టైమ్ మ్యాగజైన్ ప్రత్యేక సంచిక విడుదల చేసింది. దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులో రైతు ఉద్యమంలో పాల్గొన్న మహిళల ఫొటోతో ఉన్న ఈ సంచిక కవర్‌పేజీని ఆ పత్రిక నేడు విడుదల చేసింది. నన్ను బెదిరించలేరు.. నన్ను కొనలేరు అనే శీర్షికతో టైమ్ ఈ కథనం ప్రచురించింది. ఉద్యమంలో పాల్గొనడమే కాకుండా., ముందుండి నడిపిస్తున్న పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్‌కు చెందిన మహిళా రైతుల అనుభవాలు, బాధలను ఈ కవర్‌స్టోరీలో రాసుకొచ్చింది. నూతన సాగు చట్టాలపై మాత్రమే కాకుండా పితృస్వామ్యం, స్త్రీహత్య, లైంగిక హింస, లింగ వివక్షకు వ్యతిరేకంగా ఈ మహిళలు పోరాటం సాగిస్తున్నారని టైమ్ మ్యాగజైన్ పేర్కొంది.
కేంద్రం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గత 100 రోజులుగా ఢిల్లీ సరిహద్దులో అన్నదాతలు ఉద్యమం సాగిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో అనేక మంది మహిళలు కూడా పాల్గొన్నారు. సరిహద్దుల్లో ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా వెన్నుచూపకుండా ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మహిళా కిసాన్ దివస్ గా నిర్వహించాలని రైతు సంఘాల నేతలు నిర్ణయించారు.













