పివీతో సహా నలుగురికి భారతరత్న అవార్డులు
లోక్‌సభ ఎన్నికలకు ముందు కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఏకంగా ఐదుగురికి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్న ప్రకటించింది. తొలుత బీజేపీ అగ్రనేత ఎల్ కే అద్వానీ, బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్‌కు కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పౌరపురస్కారం ప్రకటించిన సంగతి తెలిసిందే. తరువాత మరో ముగ్గురికి ఈ పురస్కారాన్ని ప్రకటించింది. మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు, మరో మాజీ ప్రధాని చౌదరి చరణ్‌సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్‌కు కేంద్రం ‘భారత రత్న’ ప్రకటించింది. దీంతో ఈ ఏడాది ఏకంగా ఐదుగురికి అవార్డులు ప్రకటించినట్లైంది. దేశంలో అత్యున్నత పౌర పురస్కారం ‘భారత రత్న’. ఏదైనా రంగంలో విశేష కృషి చేసిన పౌరులకు కేంద్రం ఈ పురస్కారంతో సత్కరిస్తుంటుంది. ఇది 1954, జనవరి 2న భారతదేశ మొదటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించారు.
ఇప్పటివరకు నలభై మందికిపైగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు. వారిలో ఇద్దరు విదేశీయులున్నారు. భారతరత్న పొందిన పౌరులకు 7వ స్థాయి గౌరవం లభిస్తుంది. ఈ పురస్కారాన్ని ప్రతి ఏటా ముగ్గురికి మాత్రమే ప్రకటిస్తుంటారు. దేశ ప్రధాని మాత్రమే రాష్ట్రపతికి ఏడాదికి గరిష్ఠంగా ముగ్గురిని ఈ పురస్కారానికి సిఫారసు చేయవచ్చు. కానీ, దీనికి పరిమితి మాత్రం లేదు. 1999లో ఈ పురస్కారాన్ని నలుగురు వ్యక్తులకు ప్రదానం చేశారు. అంతే అప్పటి నుంచి ఏడాదికి ముగ్గురికి మాత్రమే ప్రకటిస్తూ వస్తున్నారు. అయితే, ఎన్నడూ లేని విధంగా ఈ ఏడు ఏకంగా ఐదుగురికి భారత రత్న వరించడం విశేషం. కాగా, ఈ ఏడాది భారతరత్న అవార్డులను ప్రకటించిన ఐదుగురిలో నలుగురికి మరణానంతరం అవార్డు వరించింది. ప్రస్తుతం అవార్డుకు ఎంపికైనవారిలో ఎల్కే అద్వానీ మాత్రమే జీవించి ఉన్నారు.
పీవికి భారతరత్న
బారతదేశాన్ని ప్రగతిపథం వైపు అడుగువేసేందుకు బలమైన పునాధులు వేసి పాములపర్తి వెంకట నరసింహరావుకు భారత రత్న పురస్కారం లభించడంపై పలువురు తెలుగువారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 61 ఏళ్ల తర్వాత మళ్లీ తెలుగువారికీ ఈ అవార్డు వచ్చింది. 1963లో ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు జాకీర్ హుస్సేన్‌కి ఈ పురస్కారం అందిన తర్వాత ఇన్ని సంవత్సరాలకు పీవీకి ఈ పురస్కారం దక్కడం విశేషం. ఎప్పుడో లభించాల్సి ఉన్నా ఇప్పుటికైన బహుభాష కోవిదుడు, ఆధునిక భారత్ కు బాటలు పరిచిన నేతకు ఇప్పటికైన అత్యన్నత పురస్కారం లభించడం పట్ల తెలంగాణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.. ఈ అవార్డు రావడం పట్ల పివి కుటుంబ సభ్యులు ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలిపారు.
పీవీ నరసింహారావు భారతదేశానికి 9వ ప్రధానమంత్రిగా సేవలందించారు. 1957లో శాసనసభ్యుడిగా రాజకీయ జీవితం ప్రారంభించారు. తెలంగాణలోని వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లిలో 1921 జూన్ 28న రుక్నాబాయి, సీతారామారావు దంపతులకు పీవీ జన్మించారు. 1951లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీలో సభ్యుడిగా చేరిన ఆయన తన రాజకీయ జీవితాన్ని జర్నలిస్టుగా ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి ప్రధానమంత్రి అయ్యారు.
ఎన్నికల సమయంలో బిజెపి వ్యూహంతో కాంగ్రెస్‌కు నష్టం…
ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అన్ని పార్టీలూ కాస్తోకూస్తో లబ్ది చేకూరేలా నిర్ణయాలు తీసుకోవడం కామన్. అయితే ఈ విషయంలో బీజేపీ కాస్త ముందుంటుందని చెప్పొచ్చు. తమ ముందున్న సవాళ్లను అధిగమించి వాటిని తమకు అనుకూలంగా మలుచుకోవడంలో ఆ పార్టీ పీహెచ్డీ చేసింది. మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పరిస్థితులను తమకు పాజిటివ్ గా మార్చుకునేందుకు బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే పలువురు ప్రముఖులకు భారత రత్న పురస్కారాలను అందించిందని చెప్పొచ్చు. అద్వానీ, పీవీ నరసింహా రావు, చౌదరి చరణ్ సింగ్, కర్పూరీ ఠాకూర్, స్వామినాథన్ తదితరులకు ఈ ఏడాది భారతరత్న పురస్కారానికి ఎంపిక చేసింది కేంద్ర ప్రభుత్వం.
అయోధ్యలో ఆలయ నిర్మాణం కోసం అహరహం శ్రమించారు ఎల్కే అద్వాని. ఆయన దేశవ్యాప్తంగా చేసిన రథయాత్ర హిందువుల్లో చైతన్యాన్ని తీసుకొచ్చింది. అప్పటి నుంచి అయోధ్య ఆలయ నిర్మాణం కోసం హిందువులంతా పోరాడుతున్నారు. ఈ స్ఫూర్తి రగిలించిన అద్వానీ ఎన్నో కేసులను ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినా ఆయన ధైర్యంగా పోరాడారు. ఒకవైపు అయోధ్య ఆలయం సాకారమైన సమయంలోనే అద్వానీకి భారతరత్న పురస్కారం అందించింది కేంద్రం. ఆలయ ప్రారంభోత్సవానికి అద్వానీని ఆహ్వానించకుండా అవమానించిందనే విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఆ తర్వాత వారం రోజులకే అద్వానీని భారతరత్న పురస్కారానికి ఎంపిక చేసి విమర్శలకు చెక్ పెట్టింది బీజేపీ.
ఇక పీవీ నరసింహారావును భారత రత్నకు ఎంపిక చేయడం బీజేపీ ముందుచూపుకు నిదర్శనం. దేశ ఆర్థిక సంస్కరణలను కొత్త పుంతలు తొక్కించారు పీవీ. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు ఇప్పుడు అనేక విప్లవాలకు దారి తీశాయి. గాంధేయేతర ఫ్యామిలీ నుంచి ప్రధానిగా ఐదేళ్లు పాలించిన వ్యక్తిగా పీవీ చరిత్ర సృష్టించారు. అయితే ఆయన ప్రధానిగా దిగిపోయిన తర్వాత అనేక కేసులు ఆయన్ను చుట్టు ముట్టాయి. అయినా ఆయన లెక్కచేయకుండా పోరాడి క్లీన్‌గా బయటికొచ్చారు. పీవీ మృతి చెందిన సమయంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరు ఇప్పటికీ ఆ పార్టీకి పెద్ద సమస్యగా మారింది. ఢల్లీిలో ఆయన సమాధికి స్థలం కూడా కేటాయించలేదు. స్మృతివనం ఏర్పాటు చేస్తామని చెప్పి పట్టించుకోలేదు. అసలు పీవీకి తమ పార్టీకి సంబంధం లేదన్నట్టు వ్యవహరించింది కాంగ్రెస్. ఇది అనేక విమర్శలకు తావిచ్చింది.
పీవీ విషయంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరును ప్రత్యర్థులు ఎప్పుడూ లేవనెత్తుతూనే ఉంటారు. గత ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా పీవీ అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఆయన కుమార్తెకు ఎమ్మెల్సీ సీట్ ఇచ్చి కాంగ్రెస్ తప్పిదాలను మరోసారి గుర్తు చేశారు. ఇప్పుడు మోదీ కూడా ఇదే పద్ధతిలో ముందుకెళ్లారు. పీవీ విషయంలో కాంగ్రెస్ వైఖరిని పలు సందర్భాల్లో మోదీ తప్పుబట్టారు. ఇప్పుడు ఆయనకు భారతరత్న పురస్కారాన్ని ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ పార్టీ మరోసారి చిక్కుల్లో పడింది. సొంత కుటుంబీకులకు భారతరత్న ఇచ్చుకున్నారు కానీ మహానుభావులను కాంగ్రెస్ పార్టీ విస్మరించిందని రెండ్రోజుల కిందటే లోక్ సభలో మోదీ విమర్శించారు. ఇప్పుడు పీవీకి భారతరత్న ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ చేయలేని పని తాము చేశామని చెప్పుకునే అవకాశం బీజేపీకి కలిగింది. ఇది కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేని అంశం. ఇప్పటికే చావుబతుకుల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఇది మరింత ఇబ్బంది పెట్టడం ఖాయమని అంటున్నారు.













