రామాలయం నిర్మాణంలో మరో కీలక ఘట్టం
ఉత్తర ప్రదేశ్లోని అయోధ్యలో రామాలయం నిర్మాణంలో మరో కీలక ఘట్టం ప్రారంభమైంది. రామ్ లల్లా విగ్రహాన్ని తయారు చేయించేందుకు నమూనాలను పంపించాలని దేశంలోని సుప్రసిద్ధ శిల్పులను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కోరింది. ఈ నమూనాల నుంచి ఒకదానిని ఎంపిక చేసి, విగ్రహాన్ని తయారు చేయించి రామాలయంలో ప్రతిష్ఠిస్తామని తెలిపింది. సుప్రసిద్ధ శిల్పులు కొందరు శ్రీరాముని విగ్రహ నమూనాలను పంపిస్తారు. ఒడిశాకు చెందిన సుదర్శన్ సాహూ, వాసుదేవ్ కామత్, కర్ణాటకకు చెందిన కేవీ మనియా, పుణేకు చెందిన శస్త్రయజ్య దెవుల్కర్ కూడా శ్రీరాముని విగ్రహ నమూనాలను పంపిస్తారు. 9 అంగుళాల నుంచి 12 అంగుళాల ఎత్తు ఉండే నమూనాలను పంపించనున్నారు. ట్రస్ట్ జనర్ సెక్రటరీ చంపత్ రాయ్ మాట్లాడుతూ రామ్ లల్లా విగ్రహాన్ని తయారు చేసేందుకు మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన శిలలను ఎంపిక చేసినట్లు తెలిపారు. రామ్ లల్లా విగ్రహ నమూనాను ఖరారు చేసిన తర్వాత ఈ శిలలకు ట్రస్ట్ ఆమోదం తెలుపుతుందని చెప్పారు. విగ్రహంపై సూర్య కిరణాలు పడే విధంగా 8.5 అడుగుల నుంచి 9 అడుగుల ఎత్తులో రామ్ లల్లా విగ్రహాన్ని తయారు చేయిస్తామన్నారు.













