రెండు మూడు నెలల్లో సంచలన ప్రకటన
స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్నా ఇప్పటికీ దేశంలో మంచినీరు, విద్యుత, సాగునీటి కోసం ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. జేడీ(ఎస్) అధినేత దేవెగౌడ, ఆయన తనయకుడు మాజీ సీఎం కుమారస్వామితో కేసీఆర్ సమావేశమయ్యారు. అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే ఎందరో ప్రధానులు దేశాన్ని పరిపాలించారని, ఎన్నో ప్రభుత్వాలు రాజ్యాన్ని ఏలాయని, అయినా దేశ పరిస్థితి మాత్రం మారలేదని అన్నారు. ఇన్ని సంవత్సరాలు గడచినా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే వుండిపోయిందని అసంతృప్తి వ్యక్తం చేశారు. దేవెగౌడ, కుమారస్వామితో జాతీయ, కర్ణాటక రాజకీయాలపై చర్చించినట్లు తెలిపారు. దేశంలో గుణాత్మక మార్పు రావాలని, రెండు మూడు నెలల్లో సంచలన వార్త వింటారని వ్యాఖ్యానించారు.
జాతీయ స్థాయిలో మార్పు వచ్చి తీరుతుందని, దీన్ని ఎవరు ఆపలేరన్నారు. కాంగ్రెస్, బీజేపీ పాలనలో ఎవరూ సంతోషంగా లేరని, చరిత్రలో ఎన్నడూ లేనంతగా రూపాయి విలువ పడిపోయిందన్నారు. జీడీపీలో భారత్‌ను చైనా అధిగమించిందన్నారు. సంకల్పముంటే అమెరికా కంటే బలమైన ఆర్థికశక్తిగా భారత్‌ను తీర్చిదిదొద్దచ్చని అన్నారు. ఉజ్వల భారత్ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. రోజురోజుకీ పరిస్థితి దిగజారిపోతోందని అన్నారు.













