‘నాపై తుపాకీని గురిపెడితే… మీపై ఆయుధ కర్మాగారాన్నే గురిపెడతా : మమత తీవ్ర హెచ్చరిక
నేతాజీ జయంత్యుత్సవాల సందర్భంగా మెమోరియల్ హాల్ లో చోటు చేసుకున్న పరిణామాలపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. ఈ సందర్భంగా బీజేపీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రానికి చెందిన సాంస్కృతిక సారథులందర్నీ బీజేపీ అవమానించిందని మమత ధ్వజమెత్తారు. రవీంద్రనాథ్ ఠాగూర్ మొదలుకొని బిర్సాముండా వరకూ అందర్నీ బీజేపీ అవమానించిందని ధ్వజమెత్తారు. ‘‘నేను నేతాజీ జయంత్యుత్సవాలకు హాజరయ్యాను. కొంతమంది దూకుడు స్వభావం ఉన్నవారు, మతోన్మాదులు, దేశద్రోహులు నన్ను ప్రధాని ముందే బాధపెట్టడానికి ప్రయత్నించారు. వారెవరో కూడా నాకు తెలియదు. మీరు నాపై తుపాకీని గురిపెడితే… నేరుగా ఆయుధ కర్మాగారాన్నే మీపైకి గురిపెడతాను. కానీ నేను హింసా రాజకీయాన్ని విశ్వసించను.’’ అని మమత బెనర్జీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వారు నేతాజీని అవమానించారని, అంతేకాకుండా విశ్వకవి రవీంద్రుడి జన్మస్థలాన్ని కూడా తప్పుగా పేర్కొన్నారని ఆమె బీజేపీపై మండిపడ్డారు. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు ఈశ్వరచంద్ర విద్యాసాగర్ విగ్రహాన్నే బీజేపీ వారు ధ్వంసం చేశారని, బిర్సాముండా అనుకొని వేరే విగ్రహానికి పూలమాలలు వేశారని పరోక్షంగా అమిత్షా వ్యవహార శైలిపై మండిపడ్డారు.













