ఐదో తరగతి వరకూ మాతృభాషలోనే బోధించండి: ప్రధాని
మాతృభాషలో విద్యాబోధన చిన్నారుల మానసిక వికాసంలో కీలక పాత్ర పోషిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ సృష్టం చేశారు. ముఖ్యంగా ప్రాథమిక విద్య ఇంటి/ స్థానిక భాషలోనే కొనసాగాలన్నారు. అభివృద్ధి చెందిన దేశాల అనుభవాలు ఇదే విషయాన్ని విశదీకరిస్తున్నాయని వివరించారు. 21వ శతాబ్దంలో పాఠశాల విద్య అన్న అంశంపై రెండురోజులపాటు వీడియోకాన్ఫరెన్స్ ద్వారా జరిగిన జాతీయ సమ్మేళనంలో పాల్గొన్న ఉపాధ్యాయులను నూతన విద్యావిధానం వచ్చిన తర్వాత పిల్లల బోధన ఏ భాషలో ఉంటుంది? అందులో ఏ మార్పులు తెస్తున్నారన్న చర్చ విస్త•తంగా జరుగుతోంది. భాష అన్నది బోధనా మాద్యమమే తప్ప భాషే మొత్తం విద్య కాదన్న శాస్త్రీయ సత్యాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఏ భాషలో అయితే పిల్లలు సులభంగా చదువుతూ కొత్త విషయాలు నేర్చుకుంటారో అదే బోధనా భాషగా ఉండాలి. చదువు చెప్పేటప్పుడు మనం చెప్పేది వాళ్లు అర్తం చేసుకుంటున్నారా? లేదా? అన్నది చూడాలి. ఒక వేళ అర్థం చేసుకుంటుంటే ఎంత సులభంగా అర్థం చేసుకుంటున్నారన్నది గమనించాలి. చెప్పే విషయం కంటే భాషను అర్థం చేసుకోవడానికి పిల్లలు తమ శక్తిసామర్థ్యాలన్నింటినీ దారపోసే పరిస్థితి ఉండకూడదు. ఇలాంటి విషయాలను దృష్టిలో ఉంచుకొనే చాలా దేశాల్లో ప్రాథమిక విద్య, మాతృభాషలోనే చెబుతున్నారు అని మోదీ తెలిపారు.
నూతన విద్యా విధానంలో మాతృ భాషతో పాటు ఇతర భాషలు నేర్పడం, నేర్చుకోవడంపై అడ్డంకులు కల్పించ లేదు. ఎన్ని విదేశీ భాషలైనా నేర్చుకోవచ్చు. కానీ అదే సమయంలో అన్ని భారతీయ భాషలను ప్రోత్సాహిస్తాం. పూర్వపాఠశాలల ( ప్రీ స్కూల్) స్థాయి నుంచే బలమైన పునాది వేయాలన్న ఉద్దేశంతోనే0 10+2 విద్యావిధానం స్థానంలో 5+3+3+4 వ్యవస్థను చాలా ఆలోచించి తీసుకొచ్చాం. చదవడం కోసం నేర్చుకోవటం కాకుండా నేర్చుకోవటం కోసం చదువుకోవటం అన్న దిశగా విద్యావిధానాన్ని మార్చుతున్నామని ప్రధాని చెప్పారు. మన విద్యార్థులు 21వ శతాబ్దానికి అవసరమైన నైపుణ్యాలను నేర్పిస్తూ ముందుకు తీసుకెళ్లాలి. కోడింగ్, కృత్రిమ మేథ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ డేటాసైన్స్, రోబోటిక్ సైన్స్ గురించి తెలసుకోవాలి. నూతన విద్యావిధానంపై వారం రోజుల్లో టీచర్ల నుంచి 15 లక్షలకు పైగా సలహాలు, సూచనలు వచ్చాయని నరేంద్రమోదీ పేర్కొన్నారు.













