ఈ నెల 7న సీఎంగా స్టాలిన్ ప్రమాణ స్వీకారం

తమిళనాడులో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ఈ నెల 7న ప్రమాణం స్వీకారం చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న కొవిడ్ సంక్షోభం నేపథ్యంలో నిరాడంబరంగా ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని ఇప్పటికే స్టాలిన్ స్పష్టం చేశారు. తమిళనాడులో 159 సీట్లు గెలిచి డీఎంకే పదేళ్ల తర్వాత మళ్లీ అధికారంలోకి తీసుకురావడంలో స్టాలిన్ కీలక పాత్ర పోషించారు. డీఎంకే విజయం సాధించిన అనంతరం ఆయన మెరీనా బీచ్‍లోని తన తండ్రి కరుణానిధి స్మారకం వద్దకు వెళ్లి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కొవిడ్ నిబంధనలను అనుగుణంగా అతి కొద్ది మంది సమక్షంలో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నట్లు తెలిపారు. మరోవైపు ప్రస్తుత ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే నేత ఎడప్పాడి పళనిస్వామి పదవి నుంచి తప్పుకున్నారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్‍కు పంపించారు.