ఎన్నికల బరిలో కమల్… పోటీ చేసేది ఎక్కడి నుంచో తెలుసా?
తమిళనాడులో ఎన్నికల వేడి మొదలైంది. మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) అధ్యక్షుడు కమల్ హాసన్ ఎన్నికల్లో పోటీ చేసే తమ పార్టీ అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేశారు. ఇందులో ఆయన పేరు కూడా ఉంది. తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగుతున్న కమల్ దక్షిణ కోయంబత్తూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. ఈ సందర్భంగా కమల్ మాట్లాడుతూ నేను ఐఏఎస్ అధికారిని కావాలని, ఆ తర్వాత రాజకీయాల్లోకి రావాలని మా నాన్న కలలు కనేవారు. కానీ నేను ఐఏఎస్ కాలేకపోయాను. అయితే మా పార్టీలో ఎంతో మంది సివిల్ సర్వీస్ మాజీ అధికారులు ఉండటం గర్వంగా ఉంది అని అన్నారు. కోయంబత్తూర్ దక్షిణ నియోజకవర్గ ప్రజలు తనను తప్పకుండా గెలిపిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి అన్నాడీఎంకే నేత అమ్మన్ కే అర్జునన్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తమిళనాట 234 స్థానాలకు గాను 154 స్థానాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని ఇటీవల కమల్ హాసన్ స్పష్టం చేశారు. మిగిలిన 80 సీట్లను మిత్రపక్షాలకు కేటాయించారు.













