సేమ్ సేక్స్ మ్యారేజెస్కు చట్టబద్ధతపై తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు
స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్దత కల్పించాలనే పిటిషన్లపై సుప్రీం కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఈ విషయంలో దేశ అత్యున్నత న్యాస్థానంలో చాలా పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. వీటిపై అత్యున్నత న్యాయస్థానం పది రోజుల పాటు విచారణ జరిపింది. ఈ క్రమంలోనే నేడు తీర్పును రిజర్వ్ చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ ఎస్సార్ భట్, జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ పీఎస్ నర్సింహులు ఉన్నారు. ఈ వివాహాల చట్టబద్ధతకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం కూడా తన వాదనలను వినిపించింది. స్వలింగ వివాహాలకు గుర్తింపును ఇచ్చే అంశం చాలా సంక్లిష్టమైనదని కోర్టుకు తెలిపిన కేంద్రం.. ఈ అంశం సమాజంపై చాలా ప్రభావం చూపిస్తుందని, కాబట్టి ఈ అంశాన్ని పార్లమెంటుకు వదిలివేయాలని కోరింది. రాష్ట్రాల చట్టసభలతో పాటు పౌర సమాజంలో కూడా ఈ అంశంపై విస్తృత చర్చ జరగాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఈ అంశానికి సంబంధించి ఏడు రాష్ట్ర ప్రభుత్వాల నుండి స్పందనలను కూడా కోర్టు ముందు ఉంచింది. పిటిషనర్ల వాదనలతో ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాలు విబేధించినట్లు తెలియజేసింది.













