సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు … నేడు బిల్కిస్ బానో రేపు ఎవరైనా
బిల్కిస్ బానోపై అత్యాచార ఘటన కేసులో దోషులు జైలు నుంచి విడుదల కావడం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే దోషుల రెమిషన్‌కు సంబంధించిన దస్త్రాలను అందించేందుకు సిద్ధంగా ఉండాలంటూ సుప్రీం కోర్టు జారీ చేసిన ఆదేశాల అమలుకు గుజరాత్‌తో పాటు కేంద్ర ప్రభుత్వాలు సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. రెమిషన్ దస్త్రాలు అందజేయాలంటూ మార్చి 27 సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై పున పరిశీలన పిటిషన్ దాఖలు చేస్తామని కేంద్రంతోపాటు గుజరాత్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేశాయి. దోషులకు రెమిషన్ మంజూరు చేయడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో గతంలో పిటిషన్ దాఖలైంది. అది సామూహిక అత్యాచారం, హత్యకు సంబంధించిన కేసు అని, దోషులకు రెమిషన్ మంజూరు వెనక ఉన్న నిబంధనలు ఏంటని అందులో ప్రశ్నించారు.
దీనిని విచారించిన జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్నలతో కూడిన ధర్మాసనం జైలుశిక్ష అనుభవిస్తున్న సమయంలో దోషులను ఎలా విడుదల చేస్తారని గుజరాత్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. విడుదల నిర్ణయం తీసుకునే ముందు నేర తీవ్రతను రాష్ట్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాల్సి ఉండేదని అభిప్రాయపడిరది. గర్భిణిపై సామూహిక అత్యాచారం జరగడంతో పాటు ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. బాధితుల కేసును సెక్షన్ 302తో సరిపోల్చవద్దు. యాపిల్స్‌కు నారింజ పండ్లతో పోలిక లేనట్లుగా నరమేధాన్ని ఒక్క హత్యతో పోల్చవద్దు, దేని ఆధారంగా ప్రభుత్వం ఈ విడుదల నిర్ణయం తీసుకుంది? నేడు బిల్కిస్ బానో, రేపు నేను, మీరు మరెవరైనా కావచ్చు. రెమిషన్‌కు సంబంధించిన కారణాలు తెలియజేయకుంటే మేం సొంతంగా ఓ నిర్ణయానికి రావాల్సి ఉంటుంది సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణ మే 2న చేపడతామని తెలిపింది.













