వ్యాక్సినేషన్ విషయంలో కేంద్రంపై ప్రశ్నల వర్షం కురిపించిన సుప్రీం కోర్టు

కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ విధానంలో అనుసరిస్తున్న విధానంపై సుప్రీం కోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. టీకా విధానం, ధరల్లో తేడా.. ఇలా పలు అంశాలపై సుప్రీం కోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. వ్యాక్సినేషన్ పాలసీలో ఎన్నో లోపాలున్నాయని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వేర్వేరు ధరలకు వ్యాక్సిన్లను ఎందుకు విక్రయిస్తున్నారని సుప్రీం ప్రభుత్వాన్ని నిలదీసింది. వచ్చే డిసెంబర్ నాటికి దేశ ప్రజలందరికీ వ్యాక్సిన్ ఇస్తారా? అని ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. ఈ ప్రశ్నలపై సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వివరణ ఇచ్చారు. దేశంలో అర్హులైన వారందరికీ కోవిడ్ టీకాలను ఈ ఏడాది చివరిలోగా ఇస్తామని తెలిపారు. సీరం, భారత్ బయోటెక్, రెడ్డీస్ ల్యాబ్ సంస్థలు ఉత్పత్తి చేస్తున్న టీకాలు దేశంలోని 18 ఏళ్లు నిండిన వారందరికీ సరిపోతాయని మెహతా పేర్కొన్నారు. ఫైజర్ లాంటి సంస్థలతోనూ కేంద్రం చర్చలు జరుపుతోందని సుప్రీం దృష్టికి తీసుకొచ్చారు. ఒకవేళ ఒప్పందం కుదిరితే మాత్రం అనుకున్న లక్ష్యాని కంటే ముందే వ్యాక్సినేషన్ ముగుస్తుందని తుషార్ మెహతా ధీమా వ్యక్తం చేశారు.
జనాభాలో 45 ఏళ్లు పైబడిన వారి కోసం కేంద్రమే టీకాలను సేకరిస్తోందని, 18 ఏళ్ల నుంచి 44 ఏళ్ల వారి విషయంలో మాత్రం టీకా కొనుగోళ్లలో తేడాలున్నాయని, 50 శాతం మేర తయారీ సంస్థల నుంచే రాష్ట్రాలు నేరుగా కొనుగోలు చేసుకోవచ్చని చెప్పారని, ఇలా దేని ప్రకారం కేటగిరీలుగా విభజన చేశారని సుప్రీం కోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. రెండో దశలో 18 నుంచి 44 ఏళ్ల మధ్య వయస్కులపై కూడా కోవిడ్ ప్రభావం చూపిందని, 45 ఏళ్లు దాటిన వారినే వ్యాక్సినేషన్ విషయంలో ఎందుకు పరిగణనలోకి తీసుకోవాలి? అని సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది. అలాగే టీకా డోసులకు రాష్ట్రాలు అధిక ధరను ఎందుకు చల్లించాలో చెప్పాలని కూడా ప్రశ్నించింది. దేశం మొత్తం కూడా ఒకే ధర ఉండేలా కేంద్రం బాధ్యత తీసుకోవాలని సూచించింది. వీటితో పాటు పలు రాష్ట్రాలు గ్లోబల్ టెండర్లను ఆహ్వానించడాన్ని కూడా సుప్రీం లేవనెత్తింది. ఇలా విదేశాల నుంచి రాష్ట్రాలు టీకాలు పొందడం సరికాదని, రాష్ట్రాలను కేంద్రం ఇబ్బందుల్లోకి నెట్టేస్తోందని సుప్రీం ఆక్షేపించింది.
అలాగే కోవిడ్ టీకా ముందు పోర్టల్‌లో పేర్లను నమోదు చేసుకోవాలన్న విషయాన్ని కూడా సుప్రీం కోర్టు గుర్తు చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి ఇది సాధ్యమవుతుందా? అని సూటిగా ప్రశ్నించింది. అయితే దీనిపై సొలిసిటరీ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ… ‘‘గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు కంప్యూటర్ కేంద్రానికి వెళకలి రిజిస్టర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత టీకాను పొందవచ్చు’’ అని తెలిపారు. అయితే దీనిపై సుప్రీం మళ్లీ స్పందించింది. ‘‘ఇది ఆచరణాత్మకమేనా?’’ అని సుప్రీం కేంద్రాన్ని నిలదీసింది.