అనవసరంగా అరెస్ట్ లు వద్దు : సుప్రీం

దేశంలో కరోనా విజృంభణ వేళ అరెస్టుల విషయంలో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏడేళ్ల కన్నా తక్కువ శిక్ష విధించదగిన నేరాల్లో నిందితులను అవసరమైతే తప్ప అరెస్టు చేయరాదని పోలీసులకు సూచించింది. ఖైదీలందరికీ సరైన వైద్య సదుపాయాలు అందేలా చూడాలని అధికారులను సుప్రీం ఆదేశించింది. కరోనా బారిన పడే అవకాశం ఎక్కువగా ఉన్న ఖైదీలను వెంటనే గుర్తించి, వారిని విడుదలకు తగిన ఏర్పాట్లు చేయాలని అత్యున్నత కమిటీలకు సూచించింది. దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా సాగుతున్న సమయంలో జైళ్లలో రద్దీని తగ్గించాలన్న ఉద్దేశంతోనే సుప్రీం ఈ ఆదేశాలు జారీ చేసిందని పేర్కొంటున్నారు. గతేడాది పెరోల్ మంజూరు చేసిన వారికి, మరో 90 రోజుల సెలవును కూడా మంజూరు చేయాలని ఆదేశించి. అయితే ఇలాంటి వారికి తగిన షరతులు కూడా విధించాలని నిర్దేశించింది. విలువైన సమయాన్ని ఆదా చేయడం, మహమ్మారి నుంచి గట్టెక్కడం కోసమే ఇలా చేస్తున్నామని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. జైళ్లలో వ్యాప్తిని అరికట్టడానికి తరుచుగా కోవిడ్ పరీక్షలు నిర్వహించాలని కూడా సూచించింది. ఖైదీలకు వైరస్ సోకకుండా అన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సుప్రీం సూచించింది.